నేరం చేస్తే గాయం అవుతుంది. అది మనసుకు తాకి కనులకు నీరు వస్తుంది. అయితే ఏ నేరమూ చేయకుండానే కళ్ళు ఇపుడు తడిసి ముద్ద అవుతున్నాయి. కన్నీటిలో కలవలుగా కనులు మారిపోతున్నాయి. ఇదంతా ఎందుకు అంటే సిరివెన్నెల ఇక లేరని, తిరిగి రారని తెలిసిన మనసు గాయపడి కన్నీటి వర్షం అయిన విధమిది.

అవును ఇంతకీ అభిమానులు సాహితీ ప్రేమికులు, తెలుగు సినిమా పాటను ఆరాధించేవారు చేసిన నేరమేంటి శాస్త్రి గారూ అని అడగాలనిపిస్తోంది. ఆయనే పెళ్ళి చేసుకుందాం అన్న సినిమాలో హీరో వెంకటేష్ పాత్రధానికి రాసిన పాటలో నీవేం చేశావు నేరం అంటూ హీరోయిన్ సౌందర్యను ఓదారుస్తారు. అది సూపర్ డూపర్ హిట్ సాంగ్.

మరి శాస్త్రి గారి పాటలను ప్రేమిస్తూ అందులోనే జీవిస్తూ కాలం గడిపేస్తున్న వారికి ఆయన హఠాన్మరణం అన్నది నమ్మశక్యంగా లేదు. ఆయన ఇంకా పాటలు రాయాలి, వాటిని ఆస్వాదిస్తూ తాము తరించాలి ఇది కదా తెలుగు సినీ గీతాభిమానులు కనే కల. కానీ దానిని కల్లలుగా చేస్తూ సీతారామశాస్త్రి సదూర తీరాలకు పయనం కట్టారు. సీతారామశాస్త్రి అంటే ఒక బ్రాండ్. ఆయన పాటలు అంటే యూత్ తో పాటు అందరికీ నచ్చేవి. మెచ్చేవి. అలాంటి గీతాచార్యుడు బోధనలు లేకుండా జనాలు ఎలా ఉండగలరు.


ఎన్నో భావాలకు గీతాలను రాసి మెప్పించిన శాస్త్రిగారెన దీనికి కూడా ఒక పాటను సూచించి ఉంటే బాగుండేదేమో కదా. ఆయనది ఒక శకంగా సాగింది. ఒక పధంగా సాగింది. తనకంటూ ఒక ప్రత్యేక పంధాను ఏర్పాటు చేసుకుని తెలుగు సినిమా పాటను కొత్త పుంతలు తొక్కించిన మేటి కవిగా ఘనాపాఠీగా సీతారామశాస్త్రికి తెలుగు చలన చిత్ర సీమలో ఒక అధ్యాయం ఎపుడూ ఉంటుంది. ఆయన మిగిల్చిన పాటలు శ్రోతల మదిలో ఎపుడూ నిలిచి అమృత ధారలను కురిపిస్తూనే ఉంటాయన్నది అక్షర సత్యం. అందుకే ఆయన కీర్తి అజరామరం. ఆయన కలానికి లేదు విరామం.






మరింత సమాచారం తెలుసుకోండి: