పాట పుట్టుక ఒక ప్రసవంతో సమానం. నెలను నిండిన చూలాలు బిడ్డను భూమి మీద ప్రసవించడం కోసం ఎన్ని రకాలుగా అవస్థలు పడుతుంతో పురిటి నొప్పులు ఎన్ని విధాలుగా అనుభవిస్తుందో ఆమెకే తెలుసు. అలా నవమాసాలు మోసి ప్రసవించిన తరువాతనే ఆ మాతృమూర్తికి తృప్తి కలుగుతుంది. ఆ క్షణాన బాధ అంతా మటుమాయం అవుతుంది.

కవిది కూడా అదే వేదన. అదే బాధ. ఇక సినిమా పాట రాయడం అంటే తేలిక అని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఉన్న కష్టం ఏంటో వారికే తెలుస్తుంది. పండితులను, పామరులను ఒకే మారు రంజింపచేయగల సత్తా సినిమా పాటకు ఉండాలి. అలాంటి పాటకు ఎన్నో పరిమితులు ఉంటాయి. వాటిని కూడా చూసుకుంటూ జాగ్రత్తగా పదాలు అల్లుకుంటూ అక్షరాలను ఏరుకుంటూ చేసే ఆ ప్రయత్నం నిజంగా ఎంతో క్లిష్టతరమైనది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మూడు వేల పై చిలులు పాటలు రాశారు. ఆయన మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని సాగించారు. ఆయన ప్రతీ పాటా కూడా ఒక ప్రసవ వేదన లాంటిదే. ప్రతీ గీతం వెనక ఒక భారమైన బాధ్యత ఉన్నట్లే. ఆయన పాటలను రాత్రి వేళలలో రాస్తారు అని చెబుతారు. ఆయన అలా రాత్రులు ఒంటరిగా గదిలో కూర్చుని పాట కోసం తపించే తీరు నిజంగా ఒక తపస్సులాగానే ఉంటుంది.

ఒక్కోసారి సన్నివేశానికి తగిన విధంగా పాట కుదరకపోతే దాని కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండానే గడిపేసిన సందర్భాలు శాస్త్రి గారికి ఉన్నాయి. పాట తనకు మొదట నచ్చాలి. అదీ ఆయన పెట్టుకున్న నియమం. రాయమన్నారు కదా అని ఏదో ఒకటి రాయడం కాదు, రాసిన పాటకు మొదటి శ్రోత తానే అవుతారు. తానే ఒక నిర్ణేతగా నిలిచి తీర్పు ఇచ్చుకుంటారు. అన్నీ కుదిరి తనకు నచ్చిన మీదటనే బయటకు దానికి తెస్తారు. అంతలా కష్టించి శ్రమించి పాట కోసం మెదడుని పిండి మరీ అక్షర మధనం చేశారు కాబట్టే శాస్త్రి గారి ప్రతీ పాటా ఒక ఆణిముత్యమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: