పాట అంటే హాయిగా పాడుకునేది. మనసుకు ఆహ్లదం కలిగించేది. పాట నాలిక మీద అలా కదులుతూ హుషార్ కలిగిస్తే చాలు. పాట పుట్టుక వెనక ఉన్న ప్రయోజనం ఇదే. అయితే సినిమా పాట పుట్టాక దానితో పాటు ఇంకా చాలా జత కలిశాయి. అనేక మంది కవులు పాటకు భాషను అద్దారు.

భావాలను కొత్తగా సృష్టించి పాటకు కొత్త రూపు ఇచ్చారు. ఎవరి దారి వారిదే, ఎవరి ప్రతిభ వారిదే. అయితే వారందరి కంటే కూడా భిన్నమైన శైలి సీతారామ శాస్త్రిది అని చెప్పాలి. ఆయన పాటను కేవలం ఒక పల్లవి, రెండు చరణాలు  కాదు అన్నట్లుగా భావించారు. అది సినిమా పాట అయినా జనాల మెదళ్ళను కదిలించాలి, నాలిక మీద అలా కదిలి వెళ్ళిపోకూడదు అన్నదే శాస్త్రి గారి కచ్చితమైన అభిప్రాయం. అందుకే ఆయన ప్రతీ పాట కోసం ఎంతగానో పరిశ్రమించారు.

చాలా పాటల ద్వారా ఆయన పాఠాలే చెప్పారు. ముఖ్యంగా యువతకు ఒక మాస్టారు మాదిరిగా మారి ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ మరచిపోలేనివి. బోడి చదువులు వేస్ట్ బుర్రంతా భోంచేస్తూ అన్న పాటలో శాస్త్రి గారు యువతకు అధ్బుతమైన సందేశం ఇచ్చారు. కేవలం చదువుతో మాత్రమే ఏమీ సాధించలేరు. నీలో అంతకు మించి వేరే రంగాల్లో టాలెంట్ ఉంటే నీవే ఒక టెండూల్కర్ అవుతారు. మరో ప్రతిభాశాలివి అవుతావు అంటూ ఆయన పాట ద్వారా చెప్పిన విధానం నిజంగా గ్రేట్. అలాగే గులాబీ చిత్రంలో క్లాస్ రూమ్ లో  తపస్సు చేయడం వేస్ట్ రా గురూ, బయట ఉన్నది ప్రపంచం అంటూ గీతా బోధనే చేస్తారు.

ఇక పరీక్ష తప్పితే కృంగిపోయి చావుని కోరుకునే వారికోసం సరదాగా రాసిన పాట బాటనీ పాట ఉంది అన్నది. ఇందులో మార్చి లో పాస్ కాకపోతే సెప్టెంబర్ మంత్ ఉంది అంటూ శాస్త్రి గారు వారికి కొత్త ఆశ కల్పిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాట‌లు ఉన్నాయి. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని అంటూ చైతన్యం లేని జనాలను ఆయన ఉత్తేజపరుస్తారు. మొత్తానికి శాస్త్రి గారు బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పకపోయినా పాటను పట్టుకుని మాత్రం ఎన్నో జీవిత పాఠాలే చెప్పేశారు. అందుకు ఆయనకు తెలుగు జాతి ఎప్పటికీ రుణపడిఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: