టాలీవుడ్ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. సినీ పరిశ్రమతో పాటు అభిమానులు సైతం ఆయన మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆయన పార్ధివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్ లో ఉంచారు. ఈ క్రమంలోనే సిరివెన్నెల గారికి తొలి నివాళులు అర్పించేందుకు అభిమానులతో పాటు సినీ పరిశ్రమ నుంచి సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.బుధవారం ఉదయం సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎమ్ఎమ్ కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి, తనికెళ్ల భరణి, సాయి కుమార్..

 విక్టరీ వెంకటేష్, మురళీమోహన్, ఎస్వీ కృష్ణారెడ్డి, నందినిరెడ్డి, మారుతీ తదితరులు సందర్శించి ఆయనకు పూలమాలలను సమర్పించారు. ఇక తాజాగా ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ సైతం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇక ఆ తర్వాత సిరివెన్నెల గారి పార్థివ దేహాన్ని చూస్తూ బాలయ్య చాలా ఎమోషనల్ అయ్యారు. దీంతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు బాలకృష్ణ మాట్లాడుతూ.." ఈ రోజు చాలా దుర్దినం. ఇది నిజంగా నమ్మలేని నిజం.ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు బాలయ్య.

 తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల గారు ఒక భూషణుడు. తాను పుట్టిన నేల కు వన్నెతెచ్చిన ఒక మహావ్యక్తి. 1984లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తాను నటించిన 'జననీ జన్మభూమి' సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పరిచయం అవ్వడం చాలా అదృష్టకరమని అన్నారు బాలయ్య. సిరివెన్నెల గారు లేరంటే సినిమా పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో ఉన్నట్లుంది. ఇక తనకు సాహిత్యం అంటే చాలా ఇష్టమని, సిరివెన్నెల గారిని కలిసినప్పుడల్లా తామిద్దరం సాహిత్యంపై ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం అని బాలయ్య అన్నారు. పుట్టినవారు గిట్టక తప్పదు కానీ 66 సంవత్సరాలకే సిరివెన్నెల గారు వెళ్ళి పోయారు అంటూ బాలయ్య కన్నీటిపర్యంతమయ్యారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: