టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అనేకమంది పాటల రచయితలు ఎవరికి వారు ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకోగా వారిలో ఒకింత ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తొలిసారిగా విశ్వనాధ్ తీసిన జనని జన్మభూమి సినిమాలోని తన సాహిత్య రచన తో కెరీర్ ని ఆరంభించిన సీతారామశాస్త్రి, ఆ తరువాత విశ్వనాథ్ తీసిన సిరివెన్నెల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇక ఆ సినిమాలోని పాటల గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే అనాలి.

ముఖ్యంగా అందులోని విధాత తలపున ప్రభవించినది పాట లోని అర్ధం పరమార్ధాన్ని బాగా గ్రహిస్తే సిరివెన్నెల గారి సాహిత్య గొప్పదనం గురించి మనకు అర్ధం అవుతుంది. అది మాత్రమే కాక అందులోని ప్రతి పాట ఇప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా తొలి చిత్రంతో రెండు నంది అవార్డులు గెలుచుకుని తన పేరుని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఆయన సుస్థిరం చేసుకున్నారు. అటువంటి మహా వ్యక్తి ఆ తరువాత రాసిన పాటలు ఎన్నో ఎన్నెన్నో. ఇక ఆయనకి టాలీవుడ్ లో దాదాపుగా చాలా మంది నటులతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ తో సిరివెన్నెల కు ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకం. సమవయస్కులైన ఈ ఇద్దరూ కూడా కెరీర్ బిగినింగ్ నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే.

ఇక నిన్న సిరివెన్నెల మనల్ని అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అనే విషయం తెలియగానే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందించిన చిరంజీవి, సిరివెన్నెల తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన స్వయం కృషి సినిమా నుండి ఇటీవల చేసిన అనేక సినిమాలలో ఎన్నో గొప్ప గొప్ప పాటలు సిరివెన్నెల రాసారని, కలిసినప్పుడల్లా మిత్రమా అంటూ ఎంతో హృద్యంగా సంబోధించే సిరివెన్నెల గారిని ఇటీవల 2019లో ఆయనకు అవార్డు వచ్చిన సమయంలో వారి ఇంట్లో కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు. అలానే ఇటీవల కొద్దిరోజుల క్రితం ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తిన విషయం తనకు చెప్పారని, చెన్నై లోని ఒక మంచి ఆసుపత్రి ఉంది అక్కడికి వెళ్లి మీ వ్యాధికి చికిత్స తీసుకోండి, నేను కూడా వస్తాను అన్నానని, అయితే ఈలోపు ఇక్కడ కూడా చూపించుకున్న అనంతరం అక్కడికి వెళదాం మిత్రమా అన్నారు. అలా వెళ్లిన మనిషిని ఈరోజున ఇలా జీవం లేకుండా చూస్తాను అనుకోలేదు అంటూ మెగాస్టార్ ఎమోషనల్ గా ప్రకటన విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: