తెలుగు సినిమా పాటకి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చినటువంటి ప్రముఖ  గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం రెండు తెలుగు రాష్ట్రాలలో  విషాదఛాయలు నింపింది. ఒక పాటల పూలతోట నింగికెగిసిన వేళ  ప్రతిరోజు పాటల రూపంలో మీ ముందు కదలాడుతానంటూ ఇక సెలవు అనే సందర్భాన్ని గుర్తు చేసుకోవాలంటేనే  ఎంతో ఆవేదన ఉబికి  వస్తోంది. ఆ రాగాల మాల మాయమైన వేళ మనసు తరుక్కుపోతోంది. ఎన్నో వేల పాటలకు ప్రాణాన్ని పోసిన వెల "సిరి " ఇక సెలవు అంటూ ఎంతో మంది సినీ ప్రముఖులకు కన్నీరు తెప్పిస్తున్నారు. ఆ మాయదారి న్యూమోనియా ఆయనను మట్టి పెట్టుకుపోయిందని ప్రజలంతా ఏడుస్తున్నారు.

మీరు భౌతికంగా మాకు దూరమైనా ఎన్నో నవరసాల సమ్మేళనంగా అత్యద్భుతమైన పాటలతో ప్రేక్షకుల మనసుపై చెరగని సంతకం చేసిన పాటల రారాజు  "సిరివెన్నెల"గా ఎప్పటికీ సజీవంగానే ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి  లేదు. మూడున్నర దశాబ్దాల నుంచి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలతో  మనల్ని అలరించిన సినీ పాటల  దిగ్గజం సిరివెన్నెల ప్రస్థానం..
 బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి నుంచి మొదలుకొని ఆయన ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. సిరివెన్నెల పూర్తి పేరు చెంబోలు సీతారామశాస్త్రి ఆయన 1955 మే 20 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో గల డాక్టర్ సి వి యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదివి, మిగతా చదువు ఇంటర్మీడియట్ కాకినాడలో పూర్తి చేసి, తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్లో చేరాడు. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో ఎంబీబీఎస్లో కొనసాగలేక పోయి మధ్యలోనే ఆపేశారు. పదో తరగతి అర్హతతో బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం రావడంతో కొన్నాళ్ళు రాజమహేంద్రవరంలో ఉద్యోగం కూడా చేశారు.
 సోదరుడి ప్రోత్సాహంతో.. జీవితం మలుపు..!


 చిన్నప్పటి నుంచే గాయకుడు కావాలనేది  సీతారామశాస్త్రి యొక్క కళ. అందుకు తను అర్హుడిని  కాదనే విషయాన్ని గ్రహించి, ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడైన సిరివెన్నెల తనకు తెలిసిన పదాలతో దేశభక్తి పద్యాలను, గీతాలను  రాయడం ప్రారంభించాడు. ఆయనలో మంచి కవి ఉన్నాడు అనే విషయాన్ని ఆయన సోదరుడు గమనించి ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహం  సిరివెన్నెలను సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసిందని చెప్పవచ్చు. ఆనాటి అడుగులే ఇప్పుడు వేలాది పాటలకు పూల బాటలు అయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు  బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పించి, బరువెక్కిన హృదయాలతో ఇక సెలవు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: