ముందు సింహా... తర్వాత లెజెండ్... ఇప్పుడు అఖండ... ఈ పేర్లు వింటే చాలు... నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం కరోనాతో దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మర్చిపోయారు. ఓటీటీల ద్వారా కొత్త సినిమాలను ఇంట్లోనే చూస్తున్నారు. దీంతో థియేటర్లు దాదాపు మూసివేసే స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖండ అంటూ పరిశ్రమకు ఓ కొత్త ఊపు ఇచ్చారు బోయపాటి శ్రీనివాస్. కామెడీ, పాటలు, రోమాన్స్ అనే మాటలను పూర్తిగా పక్కన పెట్టేసి... కేవలం బాలయ్య పైనే ఫోకస్ పెట్టాడు. అఖండ రూపంలో సరికొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశారు బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్ అంటే చాలు... అదో బ్లాక్ బస్టర్ హిట్ అనేలా మారిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం ఖాయమనేలా మారింది ఈ జోడీ. బీబీ 1 కంటే బీబీ 2 హిట్... ఇప్పుడు బీబీ 3 అంటూ టాలీవుడ్‌లో ఓ రికార్డు సృష్టించారు. పంచ్ డైలాగులు, పవర్ ఫుల్ ఫైట్స్‌తో బాలయ్య అభిమానులకు పవర్ ప్యాక్ అందించారు.

హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్య, బోయపాటి... కాంబినేషన్ మరోసారి కలిసేలా కనిపిస్తోంది. ఇందు కోసం ఓ యువ నిర్మాత భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అటు బోయపాటికి వరుసగా రెండు ప్లాపులు, బాలయ్యకు కూడా ప్లాపులు రావడంతో.. అఖండపై అంతగా అంచనాలు లేకుండా పోయాయి. కానీ అఖండ సూపర్ హిట్ కావడంతో... బోయపాటి ఇంటి బాట పట్టారు నిర్మాతలంతా. అయితే ముందుగా ఓ యువ నిర్మాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్ సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హారిక, హాసిని అనుబంధ సంస్థగా ఉన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్ బీ బీ - 4 సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యువ నిర్మాత నాగ వంశీ ఇప్పటికే ఈ సినిమా కోసం స్టోరీ రెడీ చేయాలని బోయపాటిని కలిసినట్లు ఫిలిం నగర్‌లో తెగ చర్చ నడుస్తోంది. ఈ సినిమా అఖండ సీక్వెల్ అవుతుందా... లేక మరో కొత్త యాక్షన్ కథతో ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏదీ ఏమైనా అఖండ హిట్‌తో బాలయ్య, బోయపాంటి కాంబోపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: