ఏపీ మంత్రుల‌కు సంబంధించి కొన్ని రూమ‌ర్లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాలోను.. వెబ్‌సైట్ల‌లో నూ.. ఏపీ మంత్రుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన రెండు మూవీలకు ఏపీ మంత్రులు క్యూ క‌ట్టుకుని.. వెళ్లార‌ని.. రాష్ట్రంలో స‌మ‌స్య‌ల‌ను వ‌దిలేశార‌ని.. ఈ విష‌యం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌ర‌కు వెళ్లింద‌ని.. ఆయ‌న కూడా సీరియ‌స్‌గానే ఉన్నార‌ని.. పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఇది నిజ‌మేనా?  వాస్త‌వం ఎంత‌? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

నిజానికి రాష్ట్రంలో కొన్ని వారాలుగా సినిమా టికెట్ల వివాదం జోరుగా సాగుతోంది. ప్ర‌భుత్వానికి తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది. అదేస‌మ‌యంలో కొంద‌రు ధియేట‌ర్ల య‌జ‌మానులు హైకోర్టుకూ వెళ్లారు. ఈ వివాదం మ‌ధ్య‌లోనే టీడీపీ నాయ‌కుడు, చంద్ర‌బాబు వియ్యంకుడు ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌య్య సినిమా వ‌చ్చింది. అదేవిధంగా రెండు రోజుల కింద‌ట బ‌న్నీ న‌టించిన పుష్ప సినిమా విడుద‌లైంది. ఈ రెండు సినిమాలకు మంత్రులు వెళ్లార‌ని.. అది కూడా ఏపీలో కాకుండా.. హైదరాబాద్‌లో ప్రీమియ‌ర్ షోల‌కు వెళ్లార‌ని.. రూమ‌ర్ ఒక‌టి హ‌ల్చ‌ల్ చేస్తోంది.

అది కూడా ముఖ్య‌మంత్రి సినిమా వివాదాల‌పై స‌మీక్ష చేస్తున్న స‌మ‌యంలోనే వీరు.. ఆ రెండు సినిమాలు చూసేందుకు జ‌ట్టుగా వెళ్లార‌ని.. రూమ‌ర్లు వ‌చ్చాయి. మ‌రి దీనిలో నిజం ఉందా? అంటే.. కొంద‌రు మంత్రులు వెళ్లిన మాట వాస్త‌వమే., అయితే.. మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ, పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి, అవంతి శ్రీనివాస్‌, వెలంప‌ల్లి శ్రీనివాస్, నారాయ‌ణ స్వామి, గుమ్మ‌నూరు జ‌య‌రాం వంటివారు.. ఏపీలోనే ఉన్నారు. వీరు ఏ సినిమాకు వెళ్లలేదు. పైగా సీఎం పాల్గొన్న విశాఖ కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌ర‌య్యారు. మ‌రి దీనిని బ‌ట్టి.. ఒక‌రిద్ద‌రు మాత్రం సినిమా చూసి ఉంటారు.

దీనికే ఇంత ర‌భ‌స చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వుద్దేశ పూర్వకంగా చేసిన దాడిలో భాగంగానే దీనిని చూడాల‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఒక‌వేళ‌.. సినిమా చూడ‌డం నిజ‌మే అయినా.. దీనిని ఆక్షేపించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. చెబుతున్నారు. ఇది స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌ని అంటున్నారు. రాజ‌కీయ నేప‌థ్యంల వ‌చ్చిన ఒక సినిమా.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌ప‌థ్యంలో వ‌చ్చిన మ‌రో సినిమాను చూస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇది కూడా నిజ‌మే క‌దా! అంటున్నారు వైసీపీ సానుభూతిప‌రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: