ఏపీ లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారం రోజురోజుకూ వివాదాన్నిపెద్ద‌ది చేసేలా ఉంది. నిన్న నేచుర‌ల్ స్టార్ నాని దీనిపై అలా మాట్లాడాడో లేదో వెంట‌నే ఏపీ మంత్రుల నుంచి వ‌రుస‌గా కౌంట‌ర్లు మొద‌ల‌య్యాయి. ముందుగా సీనియ‌ర్ నేత మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నాని కి కౌంట‌ర్ ఇచ్చారు. ఇక ఆ వెంట‌నే కొడాలి నాని కూడా నాని వ్యాఖ్య‌ల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక మ‌రి కొంద‌రు వైసీపీ నేత‌లు కూడా నాని ని కౌంట‌ర్ చేశారు. ఇక ఇండ‌స్ట్రీలో నిర్మాత న‌ట్టి కుమార్ లాంటి వాళ్లు నాని మాట‌ల‌ను త‌ప్పు ప‌ట్ట‌డంతో పాటు నాని ఏపీ ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఇక టీడీపీ ఏపీ మ‌హిళా అధ్య‌క్షు రాలు వంగ‌ల‌పూడి అనిత లాంటి వాళ్లు అయితే నాని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇక కొంద‌రు నిర్మాత ల‌తో పాటు మ‌రో హీరో సిద్ధార్థ్ లాంటి వాళ్లు నానికి స‌పోర్ట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. సందీప్ కిష‌న్ కూడా నానికి స‌పోర్ట్ చేశారు. బ్ర‌హ్మాజీ లాంటి వాళ్లు కూడా జ‌గ‌న్ ఈ విష‌యంలో కాస్త ఆదుకోవాల‌ని కోరారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే విష‌య‌మై ఏపీ మంత్రి అనిల్ కుమార్ కూడా స్పందించారు.

ఈ రోజు నెల్లూరు లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న టిక్కెట్ రేట్లు పెంచాల‌ని అడుగుతోన్న వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాని అన్న వ్యాఖ్య‌ల పై స్పందించాల‌ని మీడియా వాళ్లు అడిగితే అస‌లు నాని ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని వ్య‌గ్యంగా అనిల్ కుమార్ చెప్పారు. త‌న‌కు తెలిసింది అల్లా మంత్రి కొడాలి నాని మాత్ర‌మే తెలుసు అని చెప్పారు. టిక్కెట్ రేటు త‌గ్గితే ఎక్క‌డ త‌మ రెమ్యున‌రేష‌న్ త‌గ్గిపోతుందో ? అన్న బాధ‌తోనే కొంద‌రు ఈ డిమాండ్లు చేస్తున్నారంటూ అనిల్ కుమార్ మండి ప‌డ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: