కోవిడ్ -19 ఉప‌ద్ర‌వం రెండేళ్లుగా ప్ర‌పంచాన్ని వెంటాడుతూనే ఉంది. అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బ‌తీసి పలు దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ లను ఛిద్రం చేసింది. ఆతిథ్య‌రంగాన్ని, సినీ ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత దెబ్బ‌తీసింది. రిలీజ్‌కు సిద్ధ‌మైన ప‌లు సినిమాల విడుద‌ల నిలిచిపోగా, షూటింగ్ షెడ్యూళ్లు క‌కావిక‌ల‌మై మ‌రికొన్ని చిత్రాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇక ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డిన పేద సినీ కార్మికులు ఎదుర్కొన్న క‌ష్టాలు అన్నీఇన్నీకావు. వీరిని ఆదుకునేందుకు కొంద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు త‌మ‌కు సాధ్య‌మైనంతవ‌ర‌కు ప్ర‌య‌త్నించిన మాట వాస్త‌వం. రెండు వేవ్‌ల‌ను త‌ట్టుకుని ప‌రిశ్ర‌మ నిల‌దొక్కుకోవ‌డానికి ఈ ఏడాది చాలా కీల‌కం. ఆ దిశ‌గా సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌నుకునేలోగానే ఇప్పుడు క‌రోనా మూడో వేవ్ ముంచుకు వ‌స్తున్న సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌టంతో దీని ప్ర‌భావం ఏమేర‌కు ఉంటుందో తెలియ‌క‌ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. యూరోప్, అమెరికాలను మ‌రోసారి వ‌ణికిస్తున్న డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్ల‌ను క‌లిపి డెల్మిక్రాన్ గా వైద్యరంగ నిపుణులు అంటున్నారు. కొత్త వేరియంట్ కార‌ణంగా చైనాలో ఇప్ప‌టికే ఒక న‌గ‌రంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు విధించ‌గా, దాని ప్ర‌భావం క‌నిపించిన ప్రాంతాల్లో వ్యాప్తి నివార‌ణ‌కు అక్క‌డి ప్ర‌భుత్వం గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌ట్టింది.
 

      ఇప్పుడు భార‌త్‌లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో గ‌తంలో మాదిరి పెనుముప్పుగా ప‌రిణ‌మించ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకునేలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ దిశ‌గా మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, గుజ‌రాత్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క  రాష్ట్రాల్లో రాత్రిపూట క‌ర్ఫ్యూను అక్క‌డి ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నాయి. కేర‌ళ‌, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాలు కూడా ఇదే బాట‌లో న‌డ‌వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో ఒమిక్రాన్ బాధిత కేసులు ఇప్ప‌టిదాకా గుర్తించ‌ద‌గిన స్థాయిలో లేక‌పోయినా ఇక్క‌డ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్లు త‌గ్గిస్తూ తీసుకున్న‌ నిర్ణ‌యం కారణంగా థియేట‌ర్లు మూత‌ప‌డుతున్న ప‌రిస్థితి కాన‌వ‌స్తోంది. సినీ ప‌రిశ్ర‌మ‌కు సంక్రాంతి అత్యంత ముఖ్య‌మైన సీజ‌న్‌. స్టార్ హీరోల చిత్రాలు ఈ పండుగ సందర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంద‌డి చేయ‌డం ఆన‌వాయితీ. ఈసారి కూడా రెండు భారీ చిత్రాలు సంక్రాంతి బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యాయి. అవి రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్, ప్ర‌భాస్ హీరోగా వ‌స్తున్న రాధేశ్యామ్‌. ఇవి రెండూ దేశవ్యాప్తంగా విడుద‌ల‌య్యే చిత్రాలే. ఇప్పుడు కోవిడ్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌స్తే రిలీజ్ కు సర్వం సిద్ధం చేసుకున్న ఈ చిత్రాల ప‌రిస్థితి ఏంటో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌వేళ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌లో ర‌న్ చేయాల‌న్న నిబంధ‌న వ‌స్తే వీటికి పెద్ద దెబ్బే. లాక్‌డౌన్ విధించే ప‌రిస్థితి వ‌స్తే దేశవ్యాప్త మార్కెట్‌పై క‌న్నేసిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాలకు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే థియేట‌ర్ల కొర‌త రాకుండా చూసేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లానాయ‌క్‌, మ‌హేష్ స‌ర్కారువారి పాట చిత్రాల‌ను వీటి గురించే వాయిదా వేసుకున్నారు. అయినా గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌యితే ఏం చేయాలోన‌నే ఇప్పుడు ఈ చిత్రాల నిర్మాత‌లు ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: