మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ తీస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. మెగాస్టార్ తో పాటు ఆయన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు.

ఈ సినిమాని దేవాలయాల భూముల విషయమై ఇటీవల జరిగిన ఒక వాస్తవ కథని తీసుకుని దానికి కొంత కల్పితం జోడించి మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు కొరటాల శివ తీస్తున్నట్లు టాక్. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన చిరు, చరణ్ ల టీజర్స్, రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని ఆచార్యపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అయితే మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమా నుండి శానా కష్టం అనే పల్లవితో సాగే మాస్ పార్టీ సాంగ్ టీజర్ ని నేడు ఉదయం యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఆ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి యువ భామ రెజీనా నృత్యం చేస్తుండడం విశేషం.

మంచి మాస్ బీట్ తో మెగా ఫ్యాన్స్ లో మంచి కిక్ ఇచ్చేలా ఈ సాంగ్ ని సంగీత దర్శకుడు మణిశర్మ ఎంతో అద్భుతంగా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డ్యాన్స్ లో అదరగొట్టే మెగాస్టార్ ఈ సాంగ్ లో మరొక్కసారి స్టెప్పులు కుమ్మేశారని, మరి ఆయన గ్రేస్ ని రెజీనా ఎంతవరకు అందుకోగలదని కొందరు మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల చిత్రికరించబడ్డ ఈ సాంగ్ లో మెగాస్టార్ స్టెప్పులకి తగ్గట్టుగా రెజీనా డ్యాన్స్ అదరగొట్టారని, రేపు రిలీజ్ తరువాత థియేటర్స్ లో ఆడియన్స్, ఫ్యాన్స్ ఈ సాంగ్ కి విపరీతంగా చిందులేయడం ఖాయం అని అంటున్నారు. మరి మరొక నెలలో ప్రేక్షకులు ముందుకు రానున్న ఆచార్య ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: