డార్లింగ్ ప్ర‌భాస్ కెరీర్‌ బాహుబ‌లికి ముందు, ఆ సినిమా తరువాత అని ఖ‌చ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే బాహుబ‌లికి ముందు కూడా అత‌డు స్టార్ హీరోనే. అయితే చాలామంది స్టార్స్‌లో ఒక‌డు. ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్‌ల‌ త‌రువాత స్థాన‌మే. వాస్త‌వమిదే. ఒక‌రితో మ‌రొక‌రిని పోల్చ‌డం స‌రికాదేమోగానీ అప్ప‌టిదాకా వ‌చ్చిన సినిమాల వ‌సూళ్లను బ‌ట్టి చూసినా తేలేద‌దే. అయితే బాహుబ‌లి చిత్రం అత‌డిని ఎక్క‌డికో తీసుకుపోయింది. అత‌డి ఇమేజ్ టాలీవుడ్ మాత్ర‌మే కాదు బాలీవుడ్‌ను సైతం దాటిపోయేలా చేసింది. రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో కూడా లేని అత‌డితో ఏకంగా   రూ. 1,500 కోట్ల వ‌సూళ్ల సునామీ సృష్టించ‌వ‌చ్చ‌ని నిరూపించింది. అప్ప‌టిదాకా బాలీవుడ్ హీరోలు సైతం క‌ల‌లో కూడా ఊహించ‌లేని మొత్త‌మ‌ది. దీనికి వెనుక ఉన్న‌ది ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అన్న‌ది నిజ‌మే. కానీ అత‌డిని న‌మ్మి కెరీర్ విజ‌యాల బాట‌లో ఉన్న స‌మ‌యంలో ఓ నాలుగైదేళ్లు కేటాయించడ‌మంటే మాట‌లు కాదు. కానీ ప్ర‌భాస్.. రాజ‌మౌళిని న‌మ్మి ఆ సాహ‌సం చేశాడు. అందుకే దాని ఫ‌లితం పొందాడు.
 
అయితే కేవ‌లం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆ సినిమా కోసం స‌మ‌యం కేటాయించ‌డం మాత్ర‌మే కాదు ప్ర‌భాస్ చేసింది. బాహుబ‌లిగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు క‌ఠిన శిక్ష‌ణ తీసుకున్నాడు. అదీ ఎంత‌కాల‌మో తెలుసా..?  దాదాపు ఆరునెల‌లు. అవును ఇది నిజం. ఈ స‌మ‌యం సాధార‌ణంగా ఒక సినిమా తెర‌కెక్కించేందుకు స‌రిపోతుంది. కానీ ఆ చిత్రంలో యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం ప్ర‌భాస్ ప‌డ్డ క‌ష్ట‌మ‌ది. గుర్ర‌పు స్వారీ, కిక్ బాక్సింగ్, ట్రెక్కింగ్‌, మార్ష‌ల్ ఆర్ట్స్‌లో అత‌డు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుని మ‌రీ బాహుబ‌లి కోసం మేక‌ప్ వేసుకున్నాడు. అప్ప‌ట్లో కొన్నియుద్ద విద్య‌ల్లో శిక్ష‌ణ ఇచ్చేందుకు విదేశాల నుంచి వ‌చ్చిన నిపుణులు అత‌డి కోసం ప‌ని చేశారు. ఈ చిత్రంలో కేవ‌లం ప్ర‌భాస్ క‌నిపించే యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ కోస‌మే 220 రోజులు ప‌ట్టింది. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడ‌ని అంద‌రూ పొగుడుతున్నారు గానీ దాని వెనుక ఇంత శ్ర‌మ దాగి ఉంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: