ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల దాడి అంశం ఆయ‌న ఫామ్‌లో ఉన్న‌ప్పుడు తీసిన సినిమాలా ఆస‌క్తిక‌రంగా సాగిపోతోంది. మొద‌ట్లో ఇదే థియేట‌ర్ల టికెట్ ధ‌ర‌ల‌ అంశంపై ఆయ‌న త‌న‌దైన‌ శైలిలో స్పందించినా నిజానికి చాలామంది సీరియ‌స్‌గా తీసుకోలేదు. స‌హ‌జంగానే ఏదో ఒక అంశం ఆధారం చేసుకుని ప్ర‌చారంలో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తార‌నే ముద్ర వ‌ర్మ‌పై ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. అయితే ఆయ‌న లాజిక్‌తో ముడిపెడుతూ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ప్ర‌శ్న‌లు సంధించ‌డం, దానికి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ కౌంట‌ర్ ఇవ్వ‌డం అటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలతోపాటుగా ఇటు సినీ అభిమానులు సైతం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఏ అంశాన్నైనా ఒక‌సారి ప‌ట్టుకుంటే అంత తేలిగ్గా వ‌దిలే నైజం లేని వ‌ర్మ బుధ‌వారం పేర్ని నాని ఇచ్చిన‌ స‌మాధానాల‌కు బ‌దులుగా మ‌రికొన్ని ప్ర‌శ్న‌లు సంధించిన విష‌యం తెలిసిందే. తాను అడిగిన విష‌యాల‌కు గౌర‌వంగా, హుందాగా ప్ర‌తిస్పందించినందుకు మంత్రికి ధ‌న్య‌వాదాలు చెబుతూనే ఆయ‌న ఘాటుగా, సుదీర్ఘంగా పలు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ వేసిన మ‌రో కౌంట‌ర్‌కు అటు ప‌క్క‌నుంచి ఎలాంటి ప్ర‌తిస్పంద‌న ఉంటుందో చూడాల్సి ఉంది.

అంతేకాదు.. మ‌రో మంత్రి కొడాలి నాని విష‌యం మాట్లాడుతూ అస‌లు ఆ నానీ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న‌కు తెలిసింది నేచుర‌ల్ స్టార్ నాని మాత్ర‌మేన‌ని వ‌ర్మ వ్యాఖ్యానించ‌డం, చూస్తే ఈ అంశం ఇక్క‌డితో ఆగుతుందా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇప్ప‌టికే హీరో నాని ఇదే అంశ‌పై మాట్లాడ‌టం, ఆయ‌న‌పై వైసీపీ ప్ర‌భుత్వంలోని నాయ‌కులు విరుచుకు ప‌డ‌టం తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో కొడాలి నాని స్పంద‌న ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర‌లేదు. వాస్త‌వానికి వైసీపీతో వైఎస్ కుటుంబంతో వ‌ర్మ‌కు ఇప్ప‌టిదాకా మంచి సంబంధాలే ఉన్నాయి. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వ‌ర్మ‌ సినిమా తీయ‌డం, దాని వెనుక వైసీపీ నాయ‌కులే ఉన్నార‌న్న వార్త‌లు గ‌త ఎన్నిక‌ల‌ముందు అంద‌రూ చూసిన‌వే. అందుకే ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌ర్మ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో వ‌ర్మ‌కు వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. ఆయ‌న నుంచి వ‌చ్చే సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకోద‌గినవే. ఇక ఇప్ప‌టిదాకా ప‌రిశ్రమ నుంచి హీరో నాని, సిద్ధార్థ వంటి ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఈ అంశంపై ఇప్ప‌టిదాకా బ‌హిరంగంగా మాట్లాడిన‌వారే లేరన్న‌ది గ‌మ‌నించాల్సిన విష‌యం. ఈ స్థాయిలో ప్ర‌శ్నించింది వ‌ర్మ మాత్ర‌మే. గ‌తంలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స‌హా ప‌లువురు న‌టుల‌పై వ‌ర్మ చేసిన విమ‌ర్శ‌లు వివాదంగా మార‌డం, ప‌వ‌న్ అభిమానుల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య టీవీ చాన‌ళ్లు, సోష‌ల్ మీడియా వేదిక‌గా యుద్ధం జ‌ర‌గ‌డం చూసిందే. ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ వైసీపీ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా నిలవ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: