సీనియ‌ర్ టాలీవుడ్ స్టార్ హీరో వెంకీ న‌టించిన దృశ్యం-2 రీమేక్ గ‌త న‌వంబ‌ర్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. దానికి ముందు వ‌చ్చిన నార‌ప్ప కూడా ఓటీటీ వేదిక‌గా విజ‌యం అందుకుంది. ఈ సినిమాలో వెంక‌టేష్ స‌హ‌జ‌మైన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇది త‌మిళంలో ధ‌నుష్ హీరోగా వ‌చ్చిన అసుర‌న్ చిత్రానికి రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. కాగా దృశ్యం మూవీ మోహ‌న్‌లాల్ హీరోగా మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన చిత్రానికి రీమేక్‌. వ‌రుసగా వెంక‌టేష్ న‌టించిన రెండు రీమేక్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మేమంటే వెంకీ కెరీర్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన ప‌లు చిత్రాలు ఇత‌ర భాష‌ల్లో విజయ‌వంత‌మైన చిత్రాలకు రీమేక్‌లే. కెరీర్ తొలినాళ్ల‌లో ఇవే ఈయ‌న‌కు స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టాయంటే అతిశ‌యోక్తి కాద‌నే చెప్పాలి. 1986లో కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ తొలిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది స్ట్రెయిట్ మూవీ. ఆ త‌రువాత దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ హీరోగా వ‌చ్చిన బ్ర‌హ్మ‌పుత్రుడు త‌మిళంలో ర‌ఘువ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మైకేల్‌రాజ్ కు రీమేక్‌. ఆ త‌రువాత‌ హిందీలో అనిల్ క‌పూర్ హీరోగా వ‌చ్చిన తేజాబ్ చిత్రం టూ టౌన్ రౌడీగా తెలుగులో తెర‌కెక్కింది.

త‌మిళంలో విజ‌య‌కాంత్ క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన చిన‌గౌండ‌ర్ తెలుగులో వెంక‌టేష్ చిన‌రాయుడిగా మారి విజ‌యాన్ని అందుకుంది. త‌మిళంలో ప్ర‌భు హీరోగా తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ చిన‌తంబి.. 1992లో తెలుగులో వెంకీ హీరోగా చంటి చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం వెంక‌టేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచి అత‌డిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. ఆ త‌రువాత భాగ్యరాజా హీరోగా రూపొందిన సుంద‌రాకాండం తెలుగులో వెంకీ హీరోగా సుంద‌రాకాండ‌గా మారింది. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం కూడా సూప‌ర్ హిట్‌. వెంకీ అబ్బాయిగారు, కొండ‌ప‌ల్లిరాజా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, వ‌సంతం, జెమిని, సూర్య‌వంశం, సంక్రాంతి, రాజా, ఘ‌ర్ష‌ణ, బాడీగార్డ్‌, నాగ‌వ‌ల్లి, గురు త‌దిత‌ర చిత్రాలు కూడా ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన చిత్రాల రీమేక్‌లే. మొత్తంమీద వెంకీకి ఇవి బాగా క‌లిసివ‌చ్చాయ‌నే చెప్పాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: