టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చెప్పినా, ఏది చేసినా నిజంగా సంచలనం అనే చెప్పాలి. ఏ విషయం పైన అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు వర్మ. ఇక నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ మూవీతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన వర్మ, ఆ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా పలు అవకాశాలు అందుకున్న వర్మ, అనంతరం అటు బాలీవుడ్ లో కూడా పలు స్టార్స్ తో సినిమాలు తీసి బాగా పేరు దక్కించుకున్నారు.

అయితే ఇటీవల కొన్నేళ్లుగా వర్మ తీస్తున్న సినిమాలు మాత్రం ఆస్థాయిలో ఆడియన్స్ ని అలరించడం లేదు. కొన్నాళ్ల క్రితం ఆయన తీసిన సినిమాలు అన్ని కూడా బోల్తా కొడుతున్నప్పటికీ, తాను ప్రేక్షకుల కోసం కాదు తన ఇష్టం మేరకు మాత్రమే సినిమాలు తీస్తున్నానని, ఎవరికి ఇష్టం అయితే వారు చూస్తారు, నచ్చకపోతే చూడరు, అందుకే నేను ఎవరినీ నా సినిమా చూడమని బలవంతం చేయను అంటూ ఉంటారు వర్మ. ఇక తరచు పలు విషయాల పై తనదైన రీతిలో స్పందించే వర్మ, ఇటీవల ఏపీలో టికెట్ రేట్ల పై కొద్దిపాటి వివాదం జరుగుతూ ఉండడంతో ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వర్మ. టాలీవుడ్ సినిమా ప్రముఖులతో చర్చించిన అనంతరమే టికెట్ రేట్స్ అదుపు చేసేందుకు తాము సిద్ధం అయినట్లు ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు పలువురు ఏపీలో టికెట్స్ రేట్లని తగ్గించడం సరైనది కాదని అంటున్నారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ విషయమై కొద్దిరోజుల నుండి మంత్రి పేర్ని నానిని, ఏపీ ప్రభుత్వాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా, అలానే పలు మీడియా ఛానెల్స్ ద్వారా ప్రశ్నిస్తున్న వర్మ, తనకు ఏపీ ప్రభుత్వం పై ఏ మాత్రం వ్యతిరేకత లేదని, అయితే తనకు ఒక అవకాశం కనుక ఇస్తే మంత్రి పేర్ని నానితో టికెట్ రేట్స్ విషయమై మాట్లాడతానని నిన్న కోరారు. అయితే ఫైనల్ గా ఏపీ మంత్రి పేర్ని నానితో తనకు ఈ ఇష్యూ పై మాట్లాడే అవకాశం లభించిందని, ఈనెల 10న ఆయనని కలిసే అవకాశం దొరకడంతో ఆనందం వ్యక్తం చేసిన వర్మ, దానిని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. కాగా అమరావతి సచివాలయంలో పేర్ని నానిని కలిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని వర్మ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: