మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశంతో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కింది.  వాస్త‌వానికి గ‌త ఏడాది మే నెల‌లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ నిలిచింది. ఆ త‌ర్వాత శ‌ర వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన మేక‌ర్స్‌.. ఆచార్య‌ను ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలోకి దింపాల‌ని భావించారు. కానీ, అంత‌లోనే పాన్ ఇండియా చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ విడుద‌ల‌కు సిద్ధం అయ్యారు. దీంతో ఆచార్య‌ను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్క‌డిక‌క్క‌డ కోర‌లు చాచి అంద‌రిపై విరుచుకు ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రెండు చిత్రాలు వాయిదా ప‌డ్డాయి. దీంతో పాన్ ఇండియా సినిమాలు మిన‌హా మిగిలిన చిత్రాల‌న్నీ సంక్రాంతి రేసులో నిలిచేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇక ఆచార్య ఫస్ట్ కాపీ రెడీ అయి ఉంటే సంక్రాంతికి విడుదల చేసేవాళ్లు. కానీ.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వస్తున్నాయి కదా అని కొరటాల శివ పోస్ట్ ప్రొడక్షన్ పనులు తాపీగా చేసుకుంటున్నాడు. చిరంజీవి సైతం ఆచార్యను ప‌ట్టించుకోవ‌డం మానేసి పెద్ద త‌ప్పు చేసేశారు. ఇక ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆచార్య ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవ్వ‌డం చాలా క‌ష్టం. ఒక వేళ సంక్రాంతికి వ‌చ్చుంటే కాస్తో కూస్తో ఆచార్య‌కు ప్ల‌స్ అయ్యేద‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: