హీరో మహేశ్‌ బాబు ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. మహేశ్ బాబు సోదరుడు.. నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్‌బాబు ‍‌అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన్ను ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూసినట్టు తెలుస్తోంది. రమేశ్‌ బాబు  సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ పెద్ద కుమారుడు.. రమేశ్‌ బాబు కూడా మొదట్లో హీరోగా నటించారు. చాలా సినిమాల్లో తండ్రితోనూ.. తమ్ముడు మహేశ్ బాబుతోనూ కలసి నటించారు.


రమేశ్ బాబు సినిమా కెరీర్‌ ను పరిశీలిస్తే.. 1974లో అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారా రమేశ్‌బాబు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 15 చిత్రాల్లో రమేశ్ బాబు నటించారు. తండ్రి కృష్ణతో కలిసి రమేశ్ బాబు అనేక సినిమాల్లో నటించారు. కృష్ణగారి అబ్బాయి, బజారు రౌడీ వంటి చిత్రాలు రమేశ్‌ బాబుకు పేరు తెచ్చాయి. ఇవి కాకుండా కలియుగ కర్ణుడు, బ్లాక్‌ టైగర్‌, ఆయుధం, కలియుగ అభిమన్యుడు వంటి సినిమాల్లో రమేశ్‌ బాబు నటించారు. ఆయన చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్‌ చిత్రంలో నటించారు.


ముగ్గురు కొడుకులు సినిమాలో హీరో కృష్ణ, ఇద్దరు కొడుకులు రమేశ్ బాబు, మహేశ్ బాబు ముగ్గురూ నటించడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. తండ్రీ కొడుకులైన కృష్ణ.. రమేశ్ బాబు, మహేశ్ బాబులు ముగ్గురూ ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. కృష్ణ అభిమానులకు అప్పట్లో ఈ సినిమా కనువిందు చేసింది. అయితే.. రమేశ్ బాబు హీరోగా అనుకున్నంతగా సక్సస్‌ కాలేకపోయారు. తండ్రి నిర్మాతగా మారి అనేక సినిమాలు నిర్మించినా రమేశ్ బాబు హీరోగా నిలదొక్కుకోలేకపోయారు.


అందుకే.. 1997 నుంచి రమేశ్ బాబు నటనకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత 2004లో రమేశ్ బాబు నిర్మాతగా మారారు. అర్జున్‌, అతిథి సినిమాలు రమేశ్‌ బాబు నిర్మించినవే. ఇటీవల కొంతకాలంగా రమేశ్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు కాలేయ సంబంధ వ్యాధి ఉన్నట్టు తెలుస్తోంది. కానీ చిన్న వయస్సులోనే రమేశ్ బాబు మరణించడం కృష్ణ కుటుంబానికి పెను విషాదమే.

మరింత సమాచారం తెలుసుకోండి: