అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కీకి ఇచ్చే రెమ్యూనరేషన్‌తో భోజ్‌పురీలో 10 సినిమాలు తీయొచ్చని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు తీస్తూ, సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే అక్షయ్‌ 'బడే మియా..చోటే మియా' సినిమాకి 160 కోట్లు తీసుకుంటున్నాడట. అక్షయ్‌ కుమార్‌కి 160 కోట్ల రెమ్యూనరేషన్‌ ఇస్తున్నామని వషు భగ్నానీ చెప్పగానే బాలీవుడ్‌ మొత్తం షాక్ అయ్యింది. పాండమిక్‌లో కూడా ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీలో మరో హీరోగా చేస్తోన్న టైగర్‌ ష్రాఫ్‌కి 40 కోట్లు చెల్లిస్తున్నారట. ఒక్కో సినిమాకి 25 నుంచి 30 కోట్ల వరకు తీసుకునే టైగర్‌ 'చోటే మియా'గా 40 కోట్లు అందుకుంటున్నాడు.

అక్షయ్ కుమార్‌ రెమ్యూనరేషన్‌ గురించి బయటకు రాగానే, బాలీవుడ్‌లో మిగతా స్టార్ల రెమ్యూనరేషన్‌ ఎంత అనే చర్చ మొదలైంది. అక్షయ్‌ కంటే టాప్‌లో ఉన్న ఖాన్స్ ఎంత తీసుకుంటున్నారు, భారీ ఫీమేల్‌ ఫాలోయింగ్‌ ఉన్న హృతిక్‌ ఎంత చార్జ్‌ చేస్తున్నాడనే ప్రశ్నలు మొదలయ్యాయి.

హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేస్తోన్న సల్మాన్ ఖాన్‌ రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే ఉంది. ఈ హీరో 100 కోట్లు శాలరీతో పాటు శాటిలైట్‌ రైట్స్‌ కూడా తీసుకుంటున్నాడు. ఈ రైట్స్‌లో మరో 50 కోట్లకిపైగానే ప్రాఫిట్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక ఆమిర్‌ ఖాన్‌ సినిమాకి 35 కోట్లు పుచ్చుకుంటున్నాడట. అలాగే సినిమా లాభాల్లో వాటా తీసుకుంటాడని తెలుస్తోంది. ఈ రెండు కలిపి ఆమిర్‌కి 150 కోట్ల వరకు వస్తుందట.
షారుఖ్‌ ఖాన్ కొన్నాళ్లుగా సినిమాలకి దూరమయ్యాడు గానీ, రెమ్యూనరేషన్‌ మాత్రం తగ్గించలేదు. ఈ బాలీవుడ్‌ బాద్‌షా సినిమా బిజినెస్‌లో సగానికిపైగా తీసుకుంటున్నాడని చెప్తున్నారు. అలాగే అజయ్‌ దేవగణ్ 100 కోట్లు చార్జ్‌ చేస్తున్నాడట. ఇక హృతిక్ రోషన్ అయితే 110 కోట్ల వరకు అందుకుంటున్నాడట.మరింత సమాచారం తెలుసుకోండి: