సంక్రాంతి సీజ‌న్‌లో చిన్న సినిమాగా వ‌చ్చి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని పెద్ద విజ‌యాన్నందుకున్న మూవీ శ‌త‌మానం భ‌వ‌తి. శ‌ర్వానంద్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరో హీరోయిన్లుగా స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మాత‌గా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్నఉమ్మ‌డి కుటుంబాల విలువ తెలియ‌జెపుతూ, ధ‌న సంపాద‌నే ల‌క్ష్యంగా పిల్ల‌లు దూర ప్రాంతాల్లో ఉంటే, త‌ల్లిదండ్రులు ప‌డే ఆవేద‌న‌ ప‌లుచ‌న అవుతున్న మాన‌వ సంబంధాలను స్పృశిస్తూ, తానే రాసుకున్న ఓ అంద‌మైన ప్రేమ‌ క‌థ ఇది. అంతే అందంగా దానికి సెల్యులాయిడ్ రూపం ఇవ్వ‌డంలో స‌క్సెస్ కావ‌డంతో జ‌న‌వ‌రి 14, 2017న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా అంద‌రి మెప్పునూ పొంది సంక్రాంతి సూప‌ర్ హిట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. శ‌ర్వానంద్ కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా నిలిచింది.
 
నిజానికి ఆ ఏడాది సంక్రాంతి కానుక‌గా చాలాకాలం గ్యాప్ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం. 150, బాల‌కృష్ణ- ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబోలో వ‌చ్చిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి కూడా విడుద‌ల‌య్యాయి. దీంతో ఈ రెండు సినిమాల మ‌ధ్య వ‌స్తే ఇబ్బంది తప్ప‌ద‌నుకుని అప్ప‌ట్లో కొన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారు. అయితే  ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, నిర్మాత దిల్ రాజు ఇద్ద‌రూ త‌మ చిత్రంపై మంచి న‌మ్మ‌కం ఉండ‌టంతో సంక్రాంతి బ‌రిలో పెద్ద సినిమాలున్నా వెర‌వ‌కుండా త‌మ సినిమాను రిలీజ్ చేశారు. విశేష‌మేమిటంటే సంక్రాంతికి పోటీలో నిలిచిన ఈ మూడు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించి ఈ సీజ‌న్ ప్ర‌త్యేక‌తను చాటి చెప్పాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో విశేష‌మేమిటంటే ఈ సినిమా క‌థ‌కూ సంక్రాంతి పండుగ‌కూ కూడా సంబంధం ఉండ‌టం. ద‌ర్శ‌కుడు స‌తీష్ త‌న సొంత ప్రాంత‌మైన గోదావ‌రి జిల్లాల నేప‌థ్యంలోనే ఈ సినిమా క‌థ సాగుతుంది. సంక్రాంతి సంద‌డి, మ‌నుషుల మ‌ధ్య బంధాలు, భావోద్వేగాలు, బావామ‌ర‌ద‌ళ్ల స‌ర‌సాలు ఇవ‌న్నీ గొప్ప‌గా పండ‌టంతో ఇది ఓ మంచి సంక్రాంతి చిత్రంగా చాలాకాలం గుర్తుంచుకునే స్థాయిని సొంత చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: