టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి అంద‌రికీ తెలుసుగానీ అత‌డి తండ్రి ఓ పెద్ద ద‌ర్శ‌కుడన్న విష‌యం నేటి త‌రంలో చాలామందికి తెలియ‌ద‌నే చెప్పాలి. అవును.. గోపీచంద్ తండ్రి టి. కృష్ణ టాలీవుడ్‌లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌గా వెలుగొందారు. తీసిన సినిమాల సంఖ్య త‌క్కువే కావ‌చ్చు. కానీ వాటిలో ఘ‌న‌విజ‌యం సాధించిన‌వే అత్య‌ధికం.  అందుకే టాలీవుడ్‌పై ఆయ‌న ముద్ర నేటికీ స్ప‌ష్టంగానే క‌నిపిస్తుంది. టి. కృష్ణ మొద‌ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం శోభ‌న్‌బాబు హీరోగా తెర‌కెక్కించిన మొన‌గాడు. జ‌య‌సుధ, మంజుల క‌థానాయిక‌లుగా న‌టించారు. ప్ర‌ముఖ నిర్మాత టి. త్రివిక్ర‌మరావు నిర్మాత‌. 1976లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయి విజ‌యం సాధించక‌పోవ‌డంతో ఆ త‌రువాత ఏడేళ్ల‌పాటు టి. కృష్ణ‌కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు రాలేదు. కొన్ని సినిమాల‌కు ర‌చ‌నా స‌హ‌కారం అందించారు. ఆ త‌రువాత 1983లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం నేటిభార‌తం. సుమ‌న్‌, విజ‌య‌శాంతి హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో టి. కృష్ణ టాలీవుడ్‌లో వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

క‌మ్యూనిస్టు భావ‌జాల‌మున్న టి. కృష్ణ త‌న చిత్రాల‌కు తానే క‌థ‌ను త‌యారు చేసుకునేవారు. ఆయ‌న ద‌ర్శ‌కత్వం వ‌హించిన చిత్రాల‌న్నీ సామాజిక సందేశం ప్ర‌ధానంగా సాగిన‌వే. అంత‌ర్లీనంగా స‌మ‌స‌మాజం ల‌క్ష్యంగా, అవినీతి,పెట్టుబ‌డిదారీ దోపిడీకి వ్య‌తిరేకంగా ఆయ‌న చిత్రాలు రూపొందేవి. అయినా వాటిని అన్ని వ‌ర్గాల‌నూ మెప్పించేలా, క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌య‌వంత‌మ‌య్యేలా తెర‌కెక్కించడంలో ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ప్ర‌తిభ క‌నిపిస్తుంది. దేశంలో దొంగ‌లు ప‌డ్డారు, దేవాల‌యం, వందేమాత‌రం, ప్ర‌తిఘ‌ట‌న‌, రేప‌టి పౌరులు వంటి చిత్రాల‌న్నీ ఈ ర‌క‌మైన క‌థాంశాల‌తో కూడిన‌వే. వీటిలో ఎక్కువ శాతం బాక్సాఫీసు వద్ద‌ మంచి విజ‌యం సాధించిన‌వే. ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రామోజీరావు నిర్మించిన ప్ర‌తిఘ‌ట‌న చిత్రం కూడా టి. కృష్ణ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిందే. నేర‌పూరిత రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా రూపొందించిన ప్ర‌తిఘ‌ట‌న చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఈ చిత్రం హిందీలోనూ రీమేక్ చేయ‌గా అక్క‌డ కూడా సూప‌ర్ హిట్ గా నిలిచింది. పుత్త‌డి బొమ్మ పూర్ణ‌మ్మ అనే డాక్యుమెంట‌రీని కూడా టి.కృష్ణ నిర్మించారు. ఈత‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌కు ఆయ‌న స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. కేన్స‌ర్ వ్యాధి బారిన‌ప‌డి 1986లో 36 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే చ‌నిపోవ‌డంతో టాలీవుడ్‌లో టి. కృష్ణ శ‌కం ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: