కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ స‌త్తా ఏంటో ఇప్పుడు కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌డి గ‌త చిత్రాలు చూస్తే చాలు. అత‌డు తెర‌కెక్కించే చిత్రాల‌కు తమిళ‌నాట ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే ఆద‌ర‌ణ ఉంద‌న్న విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్ల నుంచీ భారీ చిత్రాల‌కు మారుపేరు శంక‌ర్‌. దానికి త‌గిన‌ట్టే విజ‌యాల‌నూ ద‌క్కించుకుంటూ వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ర‌జ‌నీకాంత్‌- శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన రోబో చిత్రం టెక్నిక‌ల్ వండ‌ర్‌గా పేరు తెచ్చుకుని.. శంక‌ర్‌ను పాన్ ఇండియా స్థాయి డైరెక్ట‌ర్‌గా మార్చ‌డంతో ఆ త‌రువాత అత‌డు తీసిన రోబో-2 పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికి త‌గిన‌ట్టుగానే దేశంలోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో ఆ చిత్రాన్ని రూపొందించాడు శంక‌ర్‌. ర‌జ‌నీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ నెగిటివ్ రోల్ పోషించిన ఈ చిత్రం బాహుబ‌లి చిత్రం రికార్డుల‌ను అధిగ‌మించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగినా ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. దీంతో శంక‌ర్ అనుకున్న కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు సైతం నిలిచిపోయాయి.
 
ఆ త‌రువాత క‌మ‌ల్‌హాస‌న్‌తో ఇండియ‌న్‌-2 మూవీని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసి కొంత‌భాగం షూటింగ్ జ‌రిపాడు.  అయితే ఆ చిత్రం షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం, ఆ దుర్ఘ‌ట‌న‌లో కొంత‌మంది యూనిట్ సిబ్బంది చ‌నిపోవ‌డం, త‌రువాత న్యాయ‌ప‌ర‌మైన వివాదాల‌తో ఆ చిత్రం ఆల‌స్యం కావ‌డంతో శంక‌ర్ ఏం చేయాలో అయోమయ ప‌రిస్థితిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో విక్ర‌మ్ హీరోగా గ‌తంలో త‌మిళంలో వ‌చ్చిన అన్నియ‌న్‌( అప‌రిచితుడు) మూవీని బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా తెర‌కెక్కించేందుకు శంక‌ర్ సిద్ధ‌మ‌య్యాడు. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ స్టార్ చెర్రీ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస‌ర్‌గా కూడా ఓ చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్‌. ఆ త‌రువాత అన్నియ‌న్ రీమేక్ మీద దృష్టి పెట్ట‌నున్నాడు. ఇక ఈ ఏడాది లోనే భార‌తీయుడు-2 కూడా వివాదాల నుంచ బ‌య‌ట‌ప‌డే తిరిగి ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది. సో.. డైరెక్ట‌ర్ శంక‌ర్ పున‌ర్వైభ‌వం కోసం కొత్త ఏడాదిపైన చాలా ఆశ‌లే పెట్టుకున్నాడ‌ని చెప్పాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: