భార‌త‌దేశం అంటేనే భిన్న‌త్వ‌లో ఏకత్వం. విభిన్న సంస్కృతుల స‌మ్మేళ‌నం. ప‌లు మ‌తాలు, కులాల స‌మాహారం. వెర‌సి అంద‌రూ క‌లిసి అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి జీవించే ఓ మినీ ప్ర‌పంచం. కొంద‌రు నాయ‌కులు త‌మ స్వార్థం కోసం ఇక్క‌డ ప్ర‌జ‌ల మ‌ధ్య  విభేదాలు సృష్టించేందుకు ప్ర‌య‌త్నించ‌వచ్చేమోగానీ, ఈ దేశంలో పుట్టి పెరిగిన ఏవ్య‌క్తి కూడా అకార‌ణంగా మ‌రో వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిపై క‌త్తి దూయ‌డు. మ‌త సామ‌ర‌స్యాన్ని చాటిచెప్పే చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో భారతీయ చిత్ర ప‌రిశ్ర‌మ త‌న బాధ్య‌త‌ను ఎప్పుడూ మ‌ర‌చిపోలేద‌నే చెప్పాలి. ఇలాంటి సినిమాయే 1977లో హిందీలో తెర‌కెక్కిన అమ‌ర్‌, అక్బ‌ర్, ఆంథోనీ. అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రిషీ క‌పూర్‌, వినోద్‌ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌న్మోహ‌న్‌దేశాయ్ నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థార‌చ‌న చేసింది ఖాద‌ర్ ఖాన్. ఒకే త‌ల్లికి పుట్టిన ముగ్గురు అన్న‌ద‌మ్ములు చిన్న‌త‌నంలో విల‌న్ కార‌ణంగా విడిపోయి వేరేచోట పెరుగుతారు. భిన్న సంస్కృతుల మ‌ధ్య పెరిగి పెద్ద‌వుతారు. ఆ త‌రువాత ఊహించ‌ని ప‌రిస్థితుల్లో క‌లుసుకుని జ‌రిగింది తెలుసుకుని క‌లిసి విల‌న్ల ఆట క‌ట్టించి ఒక్క‌ట‌వుతారు.
 
అంత‌ర్లీనంగా దేశంలోని అన్ని మ‌తాల వారు భ‌ర‌త‌మాత అనే ఒకేత‌ల్లి బిడ్డ‌ల‌మ‌న్న సందేశం ఇస్తూ తెర‌కెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆ త‌రువాత తెలుగులో సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ర‌జ‌నీకాంత్‌, చంద్ర‌మోహ‌న హీరోలుగా రామ్ రాబ‌ర్ట్ ర‌హీం పేరుతోనూ, త‌మిళంలో శంక‌ర్ స‌లీం సైమ‌న్ గానూ, మ‌ల‌యాళంలో జాన్ జాఫ‌ర్ జ‌నార్ధ‌న్ గానూ తెరకెక్కి ఆ భాష‌ల్లోనూ మంచి విజ‌య‌మే సాధించింది. ఆ త‌రువాత ఇలాంటి క‌థ‌లు చాలానే వ‌చ్చాయ‌నుకోండి. ఇక తెలుగులో ఛ‌త్ర‌ప‌తి శివాజీ చిత్రాన్ని నిర్మించాల‌న్న‌ది న‌టశేఖ‌ర కృష్ణ చిర‌కాల కోరిక. ఆయ‌న స్టార్‌డ‌మ్ కొన‌సాగుతున్న స‌మయంలో దానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి, ప‌లువురు ర‌చ‌యిత‌ల‌ను నియ‌మించుకుని స్క్రిప్టు కూడా త‌యారు చేసుకున్నార‌ని చెపుతారు. అయితే ఆ చిత్రంలోని కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కితే ఓ వ‌ర్గం మ‌నోభావాలు దెబ్బ‌తింటాయేమోన‌ని ఆలోచించిన కృష్ణ కేవ‌లం ఆ ఒక్క కార‌ణంగానే ఆ ప్రాజెక్టును మొత్తంగా ప‌క్క‌న‌బెట్టారు. ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాల‌కు ఆజ్యం పోస్తూ వాటితో చ‌లికాచుకునే కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కుల‌తో పోలిస్తే మ‌న వెండితెర క‌థానాయ‌కులు ఎంతో మెరుగని ఒప్పుకుని తీరాల్సిందే క‌దూ.!

మరింత సమాచారం తెలుసుకోండి: