కోవిడ్ మూడో వేవ్ బారినప‌డిన సెల‌బ్రిటీల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు, రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులు దీని కార‌ణంగా హోమ్ ఐసొలేష‌న్‌లో ఉండ‌గా, మ‌రికొంద‌రు చికిత్స పొందుతున్నారు. కేంద్ర‌మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కూడా త‌న‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని ఇప్ప‌టికే తెలిపారు. కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య, ప్ర‌ముఖ న‌టి రేణూదేశాయ్‌, ప‌వ‌న్ కుమారుడు అకీరా కూడా తాజాగా దీని బారిన ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని రేణుదేశాయ్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రితో పంచుకున్నారు. కోవిడ్ కేసులు భారీగాపెరుగుతున్న‌నేప‌థ్యంలో ఎక్కువ‌గా ఇంటివ‌ద్ద‌నే ఉంటున్నప్ప‌టికీ త‌న‌కు అకీరాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని ఆమె వెల్ల‌డించారు. తామిద్ద‌రూ కోలుకుంటున్న‌ట్టు కూడా తెలిపారు. అంతేకాదు.. కోవిడ్ మూడో వేవ్ ప్ర‌మాద‌క‌రం కాద‌ని ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని, త‌ప్ప‌నిస‌రిగా  అంద‌రూ మాస్క్‌లు ధ‌రించాల‌ని కూడా రేణూ దేశాయ్ సూచించారు. తాను గ‌తంలో రెండు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నానని, అకీరా కూడా ఓ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడ‌ని అయినా కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆమె ఇన్‌స్టాగ్రాం ద్వారా తెలిపారు.

ఇక బాలీవుడ్ గ్రేట్ సింగ‌ర్, భార‌త ర‌త్న ల‌తా మంగేష్క‌ర్ కూడా కోవిడ్ బారిన‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆమె ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు ఆమె బంధువ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం తెలియ‌జేస్తోంది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించండి అంటూ ల‌తా మేన‌కోడ‌లు ర‌చ‌న మీడియా ద్వారా అభిమానుల‌ను కోరారు. దేశ‌వ్యాప్తంగా ఆమె అభిమానుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా దేశ‌వ్యాప్తంగా ఉధృతంగా వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ ముప్పును నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వాలు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌ల‌వుతోంది. అయితే ప్ర‌జ‌లు స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా మాత్ర‌మే కోవిడ్ మ‌హమ్మారిని పూర్తిస్థాయిలో అదుపు చేయ‌గ‌ల‌మ‌ని గుర్తుంచుకోవాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: