మెగాస్టార్ చిరంజీవి న‌ట జీవితంలో ఓ మైలురాయిలాంటి చిత్రం ఖైదీ. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎద‌గ‌డానికి ఆయ‌న కెరీర్‌కు బ‌ల‌మైన పునాది వేసిన చిత్ర‌మిది. ఎ. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి స‌ర‌స‌న మాధ‌వి, సుమ‌ల‌త క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి ధ‌నుంజ‌య‌రెడ్డి నిర్మాత‌. 1983 అక్టోబ‌ర్‌, 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ఖైదీ.. చిరంజీవికి తిరుగులేని మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలోని సూర్యం పాత్ర చిరంజీవి కోస‌మే ద‌ర్శ‌కుడు, ర‌చయిత త‌యారు చేసుకున్న‌ట్టు అనిపిస్తుంది సినిమా చూసిన‌వారికి. అయితే నిజానికి ఈ చిత్రంలో హీరోగా న‌టించాల్సింది సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఆయ‌న కోస‌మే ఈ క‌థ త‌యారుచేసుకున్నారు. ఆయ‌న‌కు వినిపించారు కూడా. అయితే అప్ప‌టికే ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్‌గా, సూప‌ర్‌స్టార్‌గా వెలుగొందుతున్న కృష్ణ కాల్షీట్లు దొర‌క‌డం నిర్మాత‌ల‌కు గ‌గ‌నంగా మారిన ప‌రిస్థితి ఉండేది. అప్ప‌ట్లో ఆయ‌న‌ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయ‌డానికి కృష్ణ మూడు షిఫ్టుల్లో ప‌ని చేయాల్సివ‌చ్చేదంటే న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా అది నిజం. దీంతో క‌థ న‌చ్చినా ఆయ‌న ఆ సినిమా చేయ‌లేన‌ని చెప్పేశారు. దాంతో కృష్ణ స్థానంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కింది.

ఇక ఇలా గ‌తంలో ఒక హీరో చేయాల్సిన చిత్రాలు మ‌రో హీరోగా తెర‌కెక్కిన‌వి చాలానే ఉన్నాయి. ద‌గ్గుబాటి వెంక‌టేష్ హీరోగా ప‌రిచ‌య‌మైన క‌లియుగ పాండ‌వులు చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. నిజానికి ఆ స‌మ‌యంలో కృష్ణ హీరోగా డి. రామానాయుడు ఓ భారీ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. అయితే కృష్ణ అప్ప‌టికే తాను మ‌రికొంత‌మంది నిర్మాత‌ల‌కు సినిమాలు చేస్తాన‌ని క‌మిట‌య్యాయ‌ని, క‌నుక వారితో క‌లిసి నిర్మాత‌గా భాగం పంచుకోవాల‌ని రామానాయుడును కోరార‌ట‌. కానీ అది ఇష్టం లేని రామానాయుడు అదే స‌మ‌యంలో విదేశాల్లో విద్య‌ను పూర్తి చేసుకుని వ‌చ్చిన త‌న‌యుడు వెంక‌టేష్ హీరోగా ఆక‌థ‌కు మార్పులు చేర్పులు చేసి రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను రూపొందించి త‌న బ్యాన‌ర్‌లో మ‌రో హిట్ కొట్టారు. టాలీవుడ్ హిస్ట‌రీలో ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: