టాలీవుడ్ మాస్ మహారాజా వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న సినిమాల్లో 'రావణాసుర' సినిమా కూడా ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. ఇక ఈ సినిమాలో రవితేజ ఒక లాయర్ గా కనిపించనున్నాడు. ఇటీవల దీపావళికి విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో రవితేజ ఏకంగా 10 గెటప్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ లేటెస్ట్ అప్ డేట్ ని అందించింది. 

ఈ చిత్రంలో రవితేజ తో పాటు మరో హీరో అక్కినేని సుశాంత్ ఒక కీలక పాత్రను కనిపించబోతున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అధికారికంగా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ అనే పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుశాంత్ ని చూస్తుంటే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక రవితేజ ఫస్ట్ లుక్ లో ఉన్న బ్యాగ్రౌండ్ తోనే సుశాంత్ కు సంబంధించిన పోస్టర్ను డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో సుశాంత్ పొడవైన జుట్టుతో ఇంటెన్సివ్ లుక్ లో కనిపించాడు.

ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా భాగం కావడంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఇక మరోవైపు సుశాంత్ హీరోగానే కాకుండా అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషిస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించగా.. ఆ పాత్రతో సుశాంత్ కి మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఇప్పుడు రవితేజ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సుశాంత్ కి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: