తెలుగు సినిమాల్లో ముంబయి హీరోయిన్లు, విలన్లు కనిపించడం చాలా కామన్. సపోర్టింగ్‌ ఆర్టిస్టులని కూడా అక్కడి నుంచే తీసుకొస్తుంటారు. అయితే మార్కెట్‌ లెక్కలు మారాక తమిళ్‌ ఆర్టిస్టులకి ప్రాధాన్యత పెరుగుతోంది. కోలీవుడ్‌లో బిజినెస్ పెంచుకోవడానికి అక్కడి నుంచి ఆర్టిస్టులని తీసుకొస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే సినిమా చేయబోతున్నాడు. టైటిల్‌తోనే కొంచెం డిఫరెంట్‌ స్టోరీగా కనిపిస్తోన్న ఈ మూవీలో తమిళ స్టార్ విష్ణు విశాల్‌ ఒక కీ-రోల్‌ ప్లే చేస్తాడనే టాక్ వస్తోంది. ఇక ఈ హీరో ఇంతకుముందు రానా 'అరణ్య' సినిమాలోనూ నటించాడు. తమిళనాట డైరెక్టర్ కమ్‌ యాక్టర్‌గా నేషనల్‌ అవార్డ్స్‌ అందుకున్న సముద్రఖని, ఇక్కడ విలన్‌గా బిజీ అవుతున్నాడు. 'అల వైకుంఠపురములో' అప్పలనాయుడుగా డిఫరెంట్‌ మేనరిజమ్స్‌ చూపించిన సముద్రఖని, 'క్రాక్‌'లో కటారి కృష్ణగా హైలెట్‌ అయ్యాడు. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్'లోనూ ఇంపార్టెంట్ రోల్‌ ప్లే చేస్తున్నాడు.

బెస్ట్ పెర్ఫామర్‌గా తమిళ్లో సూపర్‌ స్టార్డమ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. జానర్‌తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాతో మాయ చేస్తోన్న సేతుపతి, తెలుగులో మాత్రం విలన్ రోల్స్‌కి హీరోయిజం తెచ్చిపెడుతున్నాడు. 'ఉప్పెన'లో రాయణం పాత్రతో మెప్పించాడు. అయితే ఈ మూవీ తర్వాత మరో తెలుగు సినిమాకి సైన్‌ చేయలేదు సేతుపతి. తమిళ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్‌కుమార్‌కి కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే క్రేజీ ఆఫర్స్‌ వస్తున్నాయి. సీరియస్‌ లుక్‌తో కనిపించే వరలక్ష్మికి బలమైన క్యారెక్టర్స్‌ ఇస్తున్నారు దర్శకులు. 'క్రాక్' సినిమాలో జయమ్మ పాత్రతో విలనిజం చూపించిన వరలక్ష్మి 'నాంది'లో లాయర్‌ ఆద్యగా తన టాలెంట్ చూపించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా నటిస్తోంది వరలక్ష్మి.


మొత్తానికి తమిళ ఆర్టిస్టులకు డిమాండ్ పెరిగిపోయింది. కోలీవుడ్ నటులు లేనిదే.. టాలీవుడ్ లో సినిమాలు ఉండటం లేదు.దీంతో వారు రెమ్యునరేషన్ విషయంలో ఫుల్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.



 




మరింత సమాచారం తెలుసుకోండి: