ఓవైపు.. ఏపీలో అధికార పార్టీ నేతలు సినీ పరిశ్రమపై మండిపడుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ షాకింగ్ కామెంట్లు చేశారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవని మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు ఏపీ సర్కారును పరోక్షంగా ఉద్దేశించి చేసినట్టు కనిపిస్తున్నాయి.


ఇంకా మంత్రి తలసాని ఏమన్నారంటే.. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని.. తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని..  ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చామని కూడా మంత్రి  తలసాని అన్నారు. అంతే కాదు.. ఏపీలో థియేటర్ల సమస్యపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని కూడా మంత్రి తలసాని అంటున్నారు.


సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని అందించే సాధనం అన్న మంత్రి తలసాని.. సినీ పరిశ్రమలోని సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్న మంత్రి.. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని చెప్పారు. ఏదైనా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న మంత్రి తలసాని.. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని తేల్చి చెప్పేశారు.


ఏపీలో సినీ పరిశ్రమ పెద్దలకూ.. పాలకులకూ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో మంత్రి తలసాని వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఏపీని తెలుగు సినిమా పెద్దలు పట్టించుకోవడం లేదన్న దుగ్ధ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. తాజాగా వైసీపీ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అసలు ఏపీ ఒకటుందని సినిమా పెద్దలకు గుర్తుందా అని ఆయన కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: