సిమ్రాన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 90 దశకంలో త‌నదైన అందం, అభినయం, న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముంబై భామ‌.. `అబ్బాయిగారి పెళ్లి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆపై న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `సమర సింహా రెడ్డి` చిత్రంలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత సిమ్రాన్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

వ‌రుస సినిమాలు చేస్తూ త‌న సొగసుల‌తో సిల్వర్‌ స్క్రీన్కి గ్లామర్‌ అద్ది భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషల్లోనూ న‌టించిన సిమ్రాన్‌.. కెరీర్ పిక్స్‌లో ఉన్న‌ప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైన దీపక్‌ బగ్గాని 2003లో వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన ఈ భామ‌.. ఆదిత్, అదీప్‌ అనే ఇద్దరు పిల్లల‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఇటీవ‌లె మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సిమ్రాన్‌.. తమిళ ఇండ‌స్ట్రీలో స్థిర ప‌డి అక్క‌డ‌ లీడ్, క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. అలాగే ప‌లు సీరియ‌ల్స్‌లోనూ న‌టిస్తోంది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచీ తాను నటించిన తెలుగు సినిమాల వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని చాలా ఉత్సాహంగా, ఎమోషనల్‌గా ట్వీట్లు వేస్తోంది. అయితే మంచి విజ‌యాలు సాధించిన చిత్రాల వార్షికోత్సవాలప్పుడు ట్వీట్ చేస్తే ఇబ్బందేమి ఉండ‌దు.

కానీ, డిజాస్ట‌ర్‌గా నిలిచిన చిత్రాల‌పై సైతం పోస్ట్‌లు పెడుతూ విసుగు తెప్పిస్తోంది. ఈ విష‌యంపైనే బాల‌య్య ఫ్యాన్స్ ల‌బోదిబోమంటున్నారు. ఎందుకంటే.. ఇటీవ‌ల `ఒక్కమగాడు`, `సీమ సింహం` సినిమాల‌ను గుర్తు చేసుకుంది సిమ్రాన్. కానీ, ఈ రెండు చిత్రాలు నందమూరి అభిమానులకు ఎంత‌టి చేదు జ్ఞాపకాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటువంటి సినిమాల‌ను కొనియాడుతూ ట్వీట్ వేయడం బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే సిమ్రాన్ ఎందుకిలా చేస్తుంది..? మ‌ర‌చిపోవాల్సిన జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ ఎందుకు ఇబ్బంది పెడుతుంది..? అంటూ ఆమెను ఏకేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: