మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్వింగ్‌లో.. మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే.. మరో సినిమాకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న మెగాస్టార్.. మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు మోహన్ రాజాతో కలిసి ‘గాడ్ ఫాదర్’, డైరెక్టర్ మెహర్ రమేశ్‌తో కలిసి ‘భోళాశంకర్’ సినిమాలో నటించనున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ బాబీతో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మెగాస్టార్ మాస్ లుక్ అందరినీ అలరిస్తుంది. ఈ పోస్టర్‌ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో వీరయ్య పాత్ర ఎంతో స్ట్రాంగ్‌గా ఉండనున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి పాత్రకు తగ్గట్లే తమ్ముడి పాత్ర కూడా ఉంటుందని డైరెక్టర్ తెలిపారు. తమ్ముడి పాత్ర ఎంతో బలమైనదని, సినిమాకు చాలా ప్రత్యేకమైన పాత్రగా నిలువనుందని పేర్కొన్నారు. దీంతో ఈ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంపై ఆసక్తి పెరిగింది. మొదట్లో ఈ పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు డైరెక్టర్ బాబీ చెప్పారు.


డైరెక్టర్ బాబీతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు మంచి రిలేషన్ ఉంది. దీంతో ఈ సినిమాలో మెగాస్టార్‌తో పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ, పవన్‌ కళ్యాణ్ స్థానంలో మాస్ మహారాజా రవితేజను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర 40 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలో రవితేజ పుట్టిన రోజు ఉంది. ఆ రోజు ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, రవితేజ.. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. గతంలో వీరిద్దరు కలిసి నటించిన ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీకి తమ్ముడిగా నటించారు. అలాగే ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో తళుక్కుమన్నారు. ఆ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: