స‌రిలేరు నీకెవ్వ‌రూ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ నుంచి రాబోతున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్ సంస్థ‌లు క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై మొద‌టినుంచీ మంచి అంచనాలున్నాయి. ప‌రిస్థితుల‌న్నీ స‌వ్యంగా ఉండి ఉంటే మ‌హేష్ మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావించారు. చిత్ర బృందం కూడా మొద‌టినుంచీ అదే చెపుతూ వ‌చ్చింది. గ‌త డిసెంబ‌ర్‌లోగా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులకు సిద్ధం కావాల‌ని యూనిట్ ప్లాన్ చేసుకుంది. అయితే కోవిడ్ మ‌హ‌మ్మారి మ‌రోసారి విరుచుకుప‌డుతుండ‌టంతో పాటు సంక్రాంతి బ‌రిలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు పోటీ ప‌డాల్సిరావ‌డంతో థియేట‌ర్ల స‌మ‌స్య రాకుండా ఈ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఏపీలో టికెట్ ధ‌ర‌ల అంశం తేల‌క‌పోవ‌డం కూడా కార‌ణ‌మేన‌ని చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే డిసెంబ‌ర్లోగా పూర్తి కావాల్సిన షూటింగ్ షెడ్యూల్ కూడా లేట‌వుతున్నట్టు తాజా స‌మాచారాన్ని బ‌ట్టి తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో యూనిట్ ఉంది. గ‌త నెల‌లో మ‌హేష్ కాలికి చిన్న‌పాటి స‌ర్జ‌రీ జ‌రిగింది. దీంతో మ‌హేష్ కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌కు కోవిడ్ పాజిటివ్ అని తేల‌డంతో హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌హేష్ మ‌రికొద్దిరోజుల దాకా వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో మ‌హేష్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ జ‌రిగిపోతున్న‌ట్టు తెలుస్తోంది. హీరో లేని స‌న్నివేశాల‌ను ముందుగా చిత్రీక‌రిస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం వైజాగ్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. మ‌హేష్ రాగానే ఆయ‌న కాంబినేష‌న్లో సీన్లు చిత్రీక‌రించి షూటింగ్ పూర్తి చేసే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక వేస‌వి సీజ‌న్లో కూడా భారీ పోటీ మ‌ధ్య ఈ చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

GMB