ఈ ఏడాది అల్లు వారికి అన్నీ క‌లిసొస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అల‌వైకుంఠ‌పురం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం త‌రువాత బ‌న్నీ న‌టించిన పాన్ ఇండియా మూవీ పుష్ప మొద‌ట్లో వ‌చ్చిన నెగిటివ్ టాక్‌ను ప‌టాపంచ‌లు చేస్తూ దేశవ్యాప్తంగా వ‌సూళ్ల పంట పండిస్తోంది. నేపాల్లోనూ ఈ చిత్రానికి ప్ర‌త్యేకమైన ఆద‌ర‌ణ ల‌భిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రంలో బ‌న్నీ స‌హ‌జ‌మైన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయార‌నే చెప్పాలి. ఇక అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ సంస్థ ఆహా త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువమంది నెటిజెన్ల ఆద‌ర‌ణ‌కు నోచుకుని ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ప్ర‌త్యేకించి చెప్పుకోవాలి. ఆహా ద్వారా సీనియ‌ర్ స్టార్ బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన అన్‌స్టాప‌బుల్ కార్య‌క్ర‌మం స్ట్రీమింగ్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ప్రోగ్రాం అత్యంత విజ‌య‌వంత‌మై ఇండియా లోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌డం మ‌రో ఘ‌న‌త‌. కాగా ఇప్ప‌టిదాకా తెలుగువారికి మాత్ర‌మే సంబంధించిన కార్య‌క్ర‌మాలు రూపొందించ‌డ‌మే ఈ సంస్థ అనుస‌రిస్తూ వ‌చ్చిన వ్యూహం. ఇత‌ర ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లకు భిన్నంగా కేవ‌లం తెలుగు వెబ్ సిరీస్, సినిమాలు, టాక్‌షోస్ ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ సినిమాలతో నెటిజ‌న్ల‌ను ఆకట్టుకున్న ఈ సంస్థ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ను భారీగానే పెంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ విజ‌యం అందించిన స్ఫూర్తితో ఆహా సంస్థ‌ను ఇప్పుడు ఇత‌ర భాష‌ల‌కూ విస్త‌రించ‌డానికి  అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు త‌రువాత తమిళ ప్రేక్ష‌కుల‌నూ అల‌రించేందుకు ఈ సంస్థ సిద్ద‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. మొద‌టి కంటెంట్‌గా శ‌ర‌త్ కుమార్ ప్రధాన పాత్ర‌లో రూపొందిన ఇరై అనే వెబ్ సిరీస్ ఆహా ద్వారా స్ట్రీమింగ్ కాబోతుంద‌ట‌. అంతేకాదు త‌మిళంలోనూ తెలుగు మాదిరే స‌క్సెస్ సాధించేందుకు అనువుగా త‌మిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోస్ కొనుగోలు చేసేందుకూ ఈ సంస్థ సిద్ద‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ‌న్నీ ఈ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌ని చేస్తుండ‌టం కూడా బాగా ప్ల‌స్ అవుతుంద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఆహా ఇత‌ర భాష‌ల్లోనూ స‌క్సెస్ కావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aha