సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ను బ‌ట్టి ప్ర‌ముఖుల పాపులారిటీని అంచ‌నా వేయ‌డ‌మ‌నే ట్రెండ్ మొద‌లై చాలాకాల‌మే అయింది. ఫిల్మ్ స్టార్‌లు, రాజ‌కీయనాయ‌కుల‌కు ఈ సంఖ్య ఎక్కువే ఉంటుంది. వారిలో చాలామందికి ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉండ‌టం కూడా చూశాం. కానీ అమెరిక‌న్ మోడ‌ల్ కైలీ జెన్న‌ర్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత‌మంది ఫాలో అవుతారో తెలుసుకుంటే ఎవ‌రైనా షాక్ తినాల్సిందే. అవును మ‌రి..ఈ సామాజిక మాధ్య‌మంలో ఈ భామ‌ను అనుస‌రిస్తున్నవారి సంఖ్య అక్ష‌రాలా 30 కోట్ల‌కు పైమాటే. ఇటీవ‌లే ఈమార్కు దాటి ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక మ‌హిళగా జెన్న‌ర్ రికార్డు సృష్టించింది. ఇప్ప‌టిదాకా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌ధిక  ఫాలోవ‌ర్లు క‌లిగిన మ‌హిళ‌గా పాప్ సింగ‌ర్ అరియానా గ్రాండే ఉండ‌గా జెన్న‌ర్ ఆమెను అధిగ‌మించింది. మొత్తంగా చూసినా ఫాలోవ‌ర్స్ సంఖ్య‌లో ప్ర‌పంచంలో రెండో స్థానం కూడా ఆమెదే. ఎందుకంటే ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డోను మాత్ర‌మే ఆమెకంటే ఎక్కువ‌మంది ఇన్‌స్టాగ్రామ్‌లో అనుస‌రిస్తున్నారు. పోర్చుగ‌ల్ దేశానికి చెందిన ఈ సాక‌ర్ స్టార్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 38.8 కోట్లుగా ఉంది.
 
కైలీ జెన్న‌ర్ అమెరికా రియాల్టీ టీవీ స్టార్‌గా గుర్తింపు సాధించింది. ప్ర‌స్తుతం ర్యాప‌ర్ ట్రావిస్ స్కాట్‌తో జెన్న‌ర్‌ స‌హ‌జీవ‌నం సాగిస్తోంది. వీరిద్ద‌రికీ ఇప్ప‌టికే ఒ పాప ఉండ‌గా రెండోసారి కేరీ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోల‌తో ఇన్ స్టాగ్రాంలో సంద‌డి చేసే కెన్న‌ర్ త‌న కుటుంబ స‌భ్యులతో క‌లిసి ఉన్న ఫోటోలు, పెర్స‌న‌ల్ ఫోటోలు కూడా ఈ సామాజిక మాధ్య‌మం ద్వారా పంచుకుంటుంది. కొంత‌కాలం క్రితం ట్రావిస్ స్కాట్ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌మాదం సంభ‌వించి 10మంది చ‌నిపోయారు.  దీంతో కొన్నిరోజుల‌పాటు కెన్న‌ర్ సామాజిక మాధ్య‌మంలో క‌నిపించ‌లేదు. రెండు వారాల క్రిత‌మే మ‌ళ్లీ ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే ఆమె సోష‌ల్ మీడియాకు బ్రేక్ ఇచ్చినా ఆమె ఫాలోవ‌ర్ల సంఖ్య మాత్రం పెరుగుతూ పోతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఓ మోడ‌ల్ కు హాలీవుడ్ న‌టీమ‌ణుల‌కు మించి సామాజిక మాధ్య‌మంలో పాపులారిటీ ఉండ‌టం విశేషంగానే చెప్పుకోవాలి,

మరింత సమాచారం తెలుసుకోండి: