మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం సూప‌ర్ మ‌చ్చి. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏమంత ప్ర‌చార సంద‌డి లేక‌పోవ‌డం, చిరంజీవి స‌హా ఇత‌ర మెగా హీరోలు ఎవ‌రూ ఈ చిత్ర ప్ర‌చారంలో భాగం పంచుకోక‌పోవ‌డం కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మేన‌ని చెప్పాలి. క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న రియా చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టించిన సూప‌ర్ మ‌చ్చి చిత్రం పులి వాసు ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కింది. సంక్రాంతికి భారీ బ‌డ్జెట్ సినిమాలేవీ బ‌రిలో లేక‌పోవ‌డం, పెద్ద హీరోల సినిమాల్లో బంగార్రాజు ఒక్క‌టే వ‌స్తుండ‌టంతో చిన్న హీరోల చిత్రాల‌కు ఈ సంక్రాంతి సీజ‌న్ మంచి అవ‌కాశ‌మే ఇచ్చింద‌ని చెప్పాలి. దానికి త‌గిన‌ట్టే సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్‌ క‌థానాయకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న హీరో చిత్రం, దిల్‌రాజు నిర్మాత‌గా ఆయ‌న మేన‌ల్లుడు ఆశిష్ హీరోగా తెర‌కెక్కుతున్న రౌడీ బాయ్స్ చిత్రాల‌కు సంబంధించి ప్ర‌చార ప‌ర్వం ప్ర‌స్తుతం జోరుగా సాగిపోతోంది. అయితే క‌ల్యాణ్‌దేవ్ చిత్రం మాత్రం ఎలాంటి హ‌డావిడి లేకుండా వ‌స్తోంది.
 
2018లో విజేత చిత్రం ద్వారా క‌ల్యాణ్‌దేవ్ వెండితెరకు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రానికి అప్ప‌ట్లో బాహుబ‌లి చిత్రానికి ఛాయాగ్రాహ‌కుడిగా ప‌ని చేసిన కేకే సెంథిల్‌కుమార్, రంగ‌స్థ‌లం చిత్రానికి వ‌ర్క్ చేసిన‌ రామ‌కృష్ణ వంటి సాంకేతిక నిపుణులు ప‌ని చేశారు. ఈ చిత్రం ప్రారంభం నుంచీ విడుద‌ల వ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ చిత్రం మంచి టాక్‌నే తెచ్చుకుంది. హీరోగా క‌ల్యాణ్‌దేవ్‌కు కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. మొత్తానికి మెగా ఫ్యామిలీ మెంబ‌ర్‌గా క‌ల్యాణ్ దేవ్‌ ఎంట్రీ గ్రాండ్ గానే జ‌రిగింది. దీంతో ఇత‌డు కూడా త్వ‌ర‌లోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోతాడ‌న్న‌విశ్లేష‌ణ‌లు కూడా వినిపించాయి. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ త‌ర్వాత క‌ల్యాణ్‌దేవ్ సూప‌ర్‌మ‌చ్చి ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్నాడు. కాగా ఇదే ఏడాది ఈ హీరో న‌టించిన‌ కిన్నెర‌సాని మూవీ కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: