ఇటీవ‌ల ఏపీలో ప్ర‌భుత్వానికి, చిత్ర ప‌రిశ్ర‌మకు థియేట‌ర్ల టికెట్‌ల ధ‌ర‌ల‌పై వివాదం త‌లెత్త‌డం, ఆ త‌ర్వాత అది మ‌రికాస్త ముదిరి ఇరువ‌ర్గాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌ర‌గ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగానే ఏపీ ప్ర‌భుత్వం లోని ఒక మంత్రి మాట్లాడుతూ స్టార్‌ హీరోలు త‌మ‌ రెమ్యూన‌రేష‌న్ విప‌రీతంగా పెంచేయ‌డ‌మే స‌మస్య‌కు మూల కార‌ణ‌మ‌ని, దాని కార‌ణంగానే సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప‌రిశ్ర‌మకు క‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని ఎదురుదాడి చేశారు కూడా. వారు రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకుంటే థియేట‌ర్ల‌లో ఇప్పుడున్న టికెట్‌ రేట్ల‌తోనే లాభాలు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించ‌డ‌మూ చూశాం. ఇందులో ఎవ‌రి వాద‌న నిజ‌మో చెప్ప‌డం అంత తేలికైన విష‌యం కాదు. అయితే స్టార్ హీరోల రెమ్యూన‌రేష‌న్ అంశం వివాదంగా మార‌డం మాత్రం ఇదే మొద‌టిసారి కాదు. ఎప్పుడో రెండు ద‌శాబ్దాలకు పూర్వ‌మే త‌మిళ‌నాట నిర్మాత‌ల సంఘం ఈ అంశంపై గ‌ట్టి పోరాట‌మే చేసింది. చిత్ర నిర్మాణం భారంగా మారిపోయింద‌ని, ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ త‌గ్గితేనే ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ సాగించ గ‌ల‌ద‌ని, స్టార్‌ హీరోలు త‌మ‌ పారితోషికాల్ని త‌గ్గించుకోవాల‌ని ఈ సంఘం అప్ప‌ట్లో డిమాండ్ చేసింది.

ఇరు ప‌క్షాల మ‌ధ్య సినీ పెద్ద‌ల ఆధ్వ‌ర్యంలో చ‌ర్చ‌లు, స‌మావేశాలు కూడా న‌డిచాయి. అయితే నిర్మాత‌ల సంఘం డిమాండ్‌ను సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆ స‌మావేశంలో గ‌ట్టిగా ఖండించారు. త‌మ సినిమాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంది కాబ‌ట్టే డిమాండ్ కు త‌గిన‌ట్టుగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నామని, త‌మ‌ను నియంత్రించ‌డానికి ఎవ‌రికీ హ‌క్కులేద‌ని క‌రాఖండిగా చెప్పి ఆ స‌మావేశం మ‌ధ్య‌లోనుంచి ఆగ్ర‌హంగా లేచి వెళ్లిపోయారు. విశేష‌మేమిటంటే ర‌జ‌నీతో వృత్తిప‌ర‌మైన పోటీ ఉన్న మ‌రో స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కూడా ఈ విష‌యంలో ఆయ‌న‌నే గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. దీంతో నిర్మాత‌ల పోరాటం ఫ‌లించ‌లేదు. అయితే ఈ వివాదం తరువాత ర‌జ‌నీకాంత్ త‌న సినిమాల‌ లాభాల్లో వాటా తీసుకునేలా త‌న విధానం మార్చుకున్నారు. మ‌రికొంద‌రు స్టార్‌లు కూడా ఆయ‌న‌నే ఫాలో అయ్యారు. అప్ప‌ట్లో ద‌క్షిణాది హీరోల మార్కెట్ ప‌రిమితం. ఇప్పుడు వారి సినిమాల‌కు దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టంతో రెమ్యూన‌రేష‌న్ లు కూడా అదేవిధంగా పెరుగుతున్నాయ‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: