ఇప్పుడంటే ద‌క్షిణాది డైరెక్ట‌ర్ల స‌త్తా ఏంటో బాలీవుడ్ కు బాగా తెలిసొచ్చిందని అంద‌రూ ఒప్పుకునేదే. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లితో చేసిన మ్యాజిక్‌తో మొత్తంగా సౌతిండియ‌న్ సినిమాల ద‌శే మారిపోయింది. మ‌రి అంత‌కుముందు మన ద‌ర్శ‌కులు ఎవ‌రూ బాలీవుడ్ సినిమాలు తెర‌కెక్కించ‌లేదా అంటే చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. అందులో కొంద‌రు స‌క్సెస్ అయ్యారు కూడా. వీరిలో ద‌క్షిణాది భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు కె. బాల‌చంద‌ర్‌, కె. విశ్వ‌నాథ్‌, దాస‌రి నారాయ‌ణ‌రావు, కె. రాఘ‌వేంద్ర‌రావు, కె. బాప‌య్య‌, మ‌ణిర‌త్నం ఇలా చాలామందే ఉన్నారు. వీరంద‌రూ అక్క‌డా హిట్ సినిమాలు తీశారు. అయితే అవి ఒక‌ట్రెండు సినిమాల‌కే ప‌రిమితం. వీరంద‌రిలోకి క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా స‌క్సెస్ ఫుల్ సినిమాలు తీసిన ఘ‌న‌త ఖ‌చ్చితంగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుదే.  

 తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజుల‌తో ప‌లు సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను తీసిన రాఘ‌వేంద్ర‌రావు అంటే అప్ప‌ట్లో స‌క్సెస్‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ అన్న పేరుండేది. ఆ ద‌శ‌లోనే తెలుగులో సూప‌ర్‌స్టార్ కృష్ణ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించిన ఊరికి మొన‌గాడు చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో దానిని హిందీలో పున‌ర్నిర్మించాల‌ని హీరో కృష్ణ భావించారు. ఆ సినిమాకు కూడా ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌ను నిర్వ‌హించాల‌ని కోర‌డంతో రాఘ‌వేంద్ర‌రావు ఒప్పుకున్నారు. జితేంద్ర హీరోగా ఆయ‌న స‌ర‌స‌న శ్రీదేవి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం 1983లో విడుద‌లై అప్ప‌ట్లో బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. దీంతో రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట‌ర్ అంటే ఆ సినిమా స‌క్సెస్ అన్న ముద్ర బాలీవుడ్‌లోనూ ప‌డిపోయింది. ఇక‌ ఈ చిత్రం ప‌ద్మాల‌యా బ్యాన‌ర్‌కు హిందీలో గొప్ప పేరు తీసుకురావ‌డంతోపాటు అక్క‌డ మ‌రిన్ని సినిమాలు తీసేందుకు ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఆ త‌రువాత ప్ర‌ముఖ నిర్మాత‌ డి. రామానాయుడు తెలుగులో శోభ‌న్‌బాబు హీరోగా నిర్మించిన దేవ‌త చిత్రాన్ని హిందీలోనూ రాఘ‌వేంద‌ర్రావే ద‌ర్శ‌కుడిగా తోఫా పేరుతో పున‌ర్నిర్మించారు. ఈ చిత్రంలోనూ జితేంద్ర హీరో కాగా జ‌య‌ప్ర‌ద, శ్రీదేవి హీరోయిన్లు. ఇక జానేదోస్త్‌, జ‌స్టిస్ చౌధురి, మాస్ట‌ర్‌జీ, హోషియార్‌, ధ‌ర్మాధికారి, కామియాబ్, మేరే స‌ప్నోంకీ రాణి వంటి ప‌లు చిత్రాల‌కు రాఘ‌వేంద్ర‌రావు హిందీలో ద‌ర్శ‌క‌త్వం వహించారు. వీటిలో అధిక శాతం క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించిన‌వే. అంటే ఇప్పుడు ద‌క్షిణాది డైరెక్ట‌ర్‌ల హ‌వాకు అప్ప‌ట్లోనే బీజం వేసింది రాఘ‌వేంద్రుడే అని ఒప్పుకోవాల్సిందే మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: