పై వాడి ఆదేశం ఎలా ఉంది
ఆదేశాన్ని న‌మ్ముకుని ప్ర‌యాణిస్తే ఫ‌లితం ఏమౌతుంది
భ‌గ‌వంతుడు క‌లిపి ఉంచుతాడు కానీ మ‌నుషులే
విడి విడి దారుల్లో ఉంటారు..ఇవ‌న్నీ ఊహ‌లు అయితే బాగుంటాయి!
స్వ‌ప్నం స‌త్యం అయితే కొన్ని సార్లు మాత్ర‌మే దుఃఖం
ఆ దుఃఖంలో ఆ భీక‌ర స్వ‌ప్నంలో ధ‌నుష్ మ‌రియు ఐష్



మ‌నుషుల్లో క‌లిసి  ఉండేందుకు స‌రిప‌డినంత స్వేచ్ఛ లేదు.విడిపోయేంత వెసులుబాటు మాత్రం.స్వేచ్ఛ ఒక వేర్పాటు వాదం అయి ఉంది..క‌లిసి ఉండడం క‌లిపి ఉంచ‌డం అన్న‌వి బ‌ల‌మైన దృక్ప‌థాల‌కు సంకేతాలు.దృక్ప‌థం స్థిరం అయితే జీవితం నిలదొక్కుకుంటుంది.దృక్ప‌థం చెడిపోతే జీవితం ఓట‌మి చెందుతుంది. సోమ‌వారం అర్ధ‌రాత్రి వేళ వినిపించిన క‌న్నీటి గీత‌లు కొన్ని మ‌నిషి జీవితాన్నిఏ విధంగా ప్ర‌శ్నిస్తున్నాయో? ధ‌నుష్,ఐష్ జీవితం ఇక వేర్వేరుగా ఉండ‌నుంది అని తేలిపోయింది.సూప‌ర్ స్టార్ అల్లుడు అనే క్రేజ్ క‌న్నా త‌న‌కు ఇష్ట‌మ‌యిన ప‌ని త‌న‌నితాను నిరూపించుకోవడం.ఆ తోవ‌లో ఆ కోవ‌లో ఆయ‌నెన్నో సాధించారు.జాతీయ స్థాయిలో న‌టుడిగా నిల‌బ‌డ్డారు.ఆ మాట‌కు వ‌స్తే ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్య కూడా త‌న‌దైన ముద్రం సెల్యులాయిడ్ పై వేసేందుకే ప్ర‌య‌త్నించారు.కెరియ‌ర్ ప‌రంగా వీళ్ల‌ద్ద‌రూ ఎలా ఉన్నా స‌రే ఇవాళ ఆ బిడ్డ‌ల జీవితంపై వీరి నిర్ణ‌య ప్ర‌భావం ఎంత‌న్న‌దే ముఖ్యం.క‌నుక స్వేచ్ఛ‌నిచ్చే త‌ల్లిదండ్రులు స్వేచ్ఛ కోరే త‌ల్లిదండ్రులు ఆలోచించాలి మ‌రోసారి బిడ్డ‌ల కోసం.. అయితే ఒక‌రికొక‌రు అన్న మాట‌లో ఉన్న అబ‌ద్ధాన్ని నిజం చేయ‌డంలోనే ధ‌నుష్ విజ‌య‌వంతం అయ్యాడా?


నిన్న‌టి అర్ధ‌రాత్రి ప్ర‌క‌ట‌న ఒక‌టి అటు తెలుగు చిత్ర‌సీమ‌లోనూ ఇటు త‌మిళ సీమ‌లోనూ క‌ల‌వ‌రం రేపింది. ధ‌నుష్ త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్టు చేసిన విడాకుల ప్ర‌క‌ట‌న కార‌ణంగా రెండు ప్రాంతాల‌కూ చెందిన ధ‌నుష్ అభిమానులు క‌ల‌త చెందారు.ముఖ్యంగా త‌మ అభిమాన క‌థానాయ‌కుడి వైవాహిక జీవితంకు సంబంధించి చెప్పిన దిగ్భ్రాంతిక‌ర మాట రాత్రి వేళ విషాదం నింపింది. చివ‌ర్లో ఆయ‌న ఇచ్చిన తాత్విక ముగింపు కూడా అంతా  శివ‌య్యా నీదే భారం అన్న విధంగా ఉంది ఆ పంచాక్ష‌రి శ‌బ్దం.  లేఖ చివ‌ర్లో కనిపించిన ఓం న‌మఃశివాయ అన్న బీజాక్ష‌రి జీవితాల‌ను ఎందుకు నిల‌బెట్టలేక‌పోతోంది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.తాత్విక సంబంధ ధోర‌ణిలో  ఆలోచిస్తే అంతా శివేచ్ఛ.ఆ జంట విడిపోవ‌డం శివేచ్ఛ.. క‌లిసి ఉండ‌డం శివేచ్ఛ అని ఎవ‌రి వారు స‌మాధానం చెప్పుకోవ‌డంలో ఓ స‌ర్దుబాటు మాత్ర‌మే మిగిలి ఉంది. ఆ ఇద్ద‌రూ పిల్లలూ ఏమౌతారు. పాల బుగ్గ‌ల చిన్నోళ్లు ఏమౌతారు? త‌ల్లిదండ్రులు విడిపోతే బిడ్డ‌ల‌కు వ‌చ్చే క‌ష్టాన్ని ఎవ‌రు తీరుస్తారు. పిల్లలు ఎవ‌రి అవ‌స‌రాలు ఎవ‌రి దృక్ప‌థాలు అన్న‌వి తెలియ‌కుండానే కాలం అనే ముళ్ల కంచె ఎదురుగా ఉందా? దానిని దాట‌టం నెగ్గుకు రావ‌డం క‌ష్ట‌మేనా?

 
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: