తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు నాటికీ నేటికీ ఏనాటికీ రారాజుగా చెప్ప‌ద‌గ్గ ఎన్టీఆర్ పోషించిన‌న్ని విభిన్న‌మైన పాత్ర‌లు మ‌రే హీరో కూడా ఇప్ప‌టిదాకా చేయ‌లేద‌నే చెప్పాలి. ఇక ఇత‌ర భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన చిత్రాల రీమేక్‌ల్లోనూ ఆయ‌న‌వే అత్య‌ధికం. మొద‌ట్లో త‌మిళ మాతృక‌ల‌నుంచి రీమేక్ అయిన చిత్రాలు వీటిలో ఎక్కువగా ఉండ‌గా ఆ త‌రువాత హిందీ చిత్రాల క‌థ‌ల‌తో పున‌ర్నిర్మాణ‌మైన‌వి అధికం. ఇక క‌న్న‌డ‌, బెంగాలీ సినిమాల రీమేక్‌లు సైతం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కాయి. అంతేకాదు.. ఆంగ్ల చిత్రాల స్ఫూర్తితో తెలుగులో చిత్రాలు తెర‌కెక్క‌డం అప్పుడూ ఉంది. వీటిని ఫ్రీమేక్‌లు అనొచ్చు. ఎన్టీఆర్ హిందీ చిత్రాల రీమేక్ ల విష‌యానికొస్తే 1958లో వ‌చ్చిన శోభ చిత్రంతో ఈ ట్రెండ్ మొద‌లైంద‌ని చెప్పాలి. 1949లో ఏఆర్ ఖాద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుబాల‌, గీతాబాలి, సురేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెర‌కెక్కిన దులారీ చిత్రానికిది రీమేక్‌. అంజ‌లీదేవి క‌థానాయిక‌గా క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ త‌రువాత ఏడాదే వ‌చ్చిన శ‌భాష్‌రాముడు చిత్రం బాలీవుడ్ మూవీ బ‌డాభాయ్‌కు రీమేక్‌.
 
ఇక అనంత‌ర‌కాలంలో హిందీలో వ‌చ్చిన జింద‌గీ తెలుగులో ఆడ‌బ్ర‌తుకు చిత్రంగాను, దూర్ గ‌గ‌న్ కీ చాహో మే మూవీ రాము సినిమా గాను, ప్రొఫెస‌ర్ చిత్రం భ‌లే మాస్టారుగా, చైనా టౌన్ .. భ‌లే త‌మ్ముడుగా తార‌క‌రాముడు హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఆ తరువాత బాలీవుడ్లో ప్ర‌కాష్ మెహ్రా ద‌ర్శ‌క‌త్వంలో అమితాబ్ బ‌చ్చ‌న్ హీరోగా  న‌టించిన జంజీర్ సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో దానిని తెలుగులో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా నిప్పులాంటి మ‌నిషిగా తెర‌కెక్కించారు. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజ‌యం సాధించింది. యాదోంకీ బారాత్ చిత్రం అన్న‌ద‌మ్ముల అనుబంధంగా, జానీ మేరానామ్ మూవీ ఎదురులేని మ‌నిషిగా, దీవార్ మగాడుగా, డాన్ చిత్రం యుగంధ‌ర్ గా తెలుగులో తెర‌కెక్కాయి. ఎన్టీఆర్ న‌టించిన ఆరాధ‌న‌, నేరం నాదికాదు ఆక‌లిది, మా దైవం, మేలుకొలుపు, లాయ‌ర్ విశ్వ‌నాథ్‌, కేడీ నెంబ‌ర్ 1, ఎదురీత వంటి చిత్రాల‌న్నీ హిందీ రీమేక్‌లేనంటే ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది కానీ ఇది నిజం. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేముందు న‌టించిన నాదేశం చిత్రం కూడా అమితాబ్ హీరోగా వ‌చ్చిన బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ లావారిస్ కు రీమేక్ కావ‌డం విశేషం. ఈ జాబితా చూశాక ఈ విష‌యంలోనూ ఎన్టీఆర్ రికార్డును మ‌రే హీరో అందుకోలేర‌నే చెప్పాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: