ఇవాళ మెగా హీరో వ‌రుణ్ తేజ్ పుట్టిన్రోజు.ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ..రానున్న కాలంలో ఇంకొన్ని మంచి సినిమాలతో ప్రేక్ష‌కుల ప్రేమ‌నూ,ఆద‌రాన్నీ పొందాల‌ని,పెంపొందించుకోవాల‌ని ఆశిద్దాం. కెరియ‌ర్ లో ఇంకొన్ని కొత్త శిఖ‌రాల అధిరోహ‌ణ‌కు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని కోరుకుందాం.ఈ సంద‌ర్భంగా ఆయ‌న కెరియ‌ర్ విశేషాలు కొన్ని.


మీ అబ్బాయిని చూశాను బాగున్నాడు..అంటూ ముకుందా సినిమాలో రావు ర‌మేశ్ ఓ డైలాగ్ చెబుతారు.అచ్చం ఆ విధంగానే ఉంటాడీయ‌న.చూడ్డానికి బాగుంటాడు.న‌వ్వితే ఇంకా బాగుంటాడు.అస‌లు ఆ ఫ్యామిలీలో ఎవ్వ‌రూ లేనంత హైట్,ఫిజిక్ తో తెర‌పై క‌నిపించే,అల‌రించే ఆర‌డుగుల అంద‌గాడు అత‌డు.వ‌రుణ్ సినిమాల్లోకి రాకూడ‌దు,రాకూడ‌దు అనుకునే ఇటుగా వ‌చ్చేడని కొంద‌రంటారు.మొద‌టి సినిమా శ్రీ‌కాంత్ అడ్డాల‌తో చేసి మిస్ట‌ర్ కూల్ గానే ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాలో పెద్ద‌గా హీరో ఎలివేష‌న్లు,పెద్ద..పెద్ద అరుపులు,కేకలు ఉండ‌వు.కానీ ఫ‌క్తు మాస్ ఎంట‌ర్టైన‌ర్ అని మాత్రం చెప్పొచ్చు.ఒక కొత్త హీరోను అదీ మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన హీరోను ఇలా కూడా ఇంట్ర‌డ్యూస్ చేయొచ్చా అన్న విధంగా ఈ సినిమా తీసి ప్ర‌శంస‌లు అందుకున్నాడు డైరెక్ట‌ర్.అదే స‌మ‌యంలో క్యారెక్ట‌ర్ ఓన్ చేసుకున్న తీరు, ఆన్ స్క్రీన్ బిహేవియిరిజం ఇవ‌న్నీ కూడా బాగున్నాయి అని ఆ రోజు మెగా ప్రిన్స్ వ‌రుణ్ త‌న అభిమానుల నుంచి,ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి కితాబులు అందుకున్నాడు.


సినిమా త‌రువాత రెండో సినిమానే కంచె.క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఈ సినిమా దూపాటి హ‌రిబాబు క్యారెక్ట‌ర్ లో ఎంత బాగా చేశాడో! ఆ సినిమా క‌థకు ఉన్న సెన్సిబులిటీస్ ను అన్నీ అర్థం చేసుకుని యాక్ట్ చేశాడు.ఎంతో పేరు వ‌చ్చింది వ‌రుణ్ కు..ప్రేమ కూడా యుద్ధం లాంటిదే అంటూ ఆ సినిమాలో చెప్పిన ఓ పోయెటిక్ డైలాగ్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేం. మూడో సినిమానే పూరీతో! లోఫ‌ర్ అంటూ సంద‌డి చేశాడు.దిశాప‌టానీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడు.అస్స‌లు ముందు సినిమాల‌కూ ఈ సినిమాకు సంబంధ‌మే ఉండ‌దు.మాస్ హీరోగా ఆయ‌న నిల‌బ‌డిపోయాడు అనేందుకు ఈ ఒక్క సినిమా చాలు.త‌రువాత చేసిన మిస్ట‌ర్ అనే సినిమా ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో కానీ ఆయ‌న కెరియ‌ర్ మాత్రం మ‌లుపు తిప్పింది ఫిదా సినిమానే! ఆ చిత్రంలో సాయి ప‌ల్ల‌వితో పోటీ ప‌డి న‌టించి మార్కులు కొట్టేశాడు.ఈజ్ ఉన్న క్యారెక్ట‌ర్ ఇంటెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్ ఇది అని శేఖ‌ర్ క‌మ్ముల
చెప్పిన విధంగానే ఆ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ, ఆడియెన్స్ త‌న న‌ట‌న‌కు ఫిదా అయ్యేలా చేసుకున్నాడు.


సున్నిత భావోద్వేగాలు ఉన్న క‌థ ఇది.ఆ క‌థ‌ను అర్థం చేసుకుని న‌టించ‌డంతో అటు మెగాభిమానులు ఇటు ఇండ‌స్ట్రీ అంతా వ‌రుణ్ ను ఆకాశానికెత్తేశారు. ఫిదా లాంటి ఓ ప్రేమ క‌థ మ‌ళ్లీ రిపీట్ కాక‌పోయినా తొలి ప్రేమ కూడా అలాంటి మంచి సినిమానే! వీటి త‌రువాత అంత‌రీక్షం లాంటి ప్ర‌యోగాత్మ‌క క‌థ చేసి ఫెయిల్ అయ్యాడు.ఎఫ్ 2 తో ఆ లోటు పూడుస్తూ తీరుస్తూ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో వెంకీతో తెర పంచుకుని స‌క్సెస్ కొట్టాడు.అటుపై మాస్ డైరెక్ట‌ర్, గ‌బ్బ‌ర్ సింగ్ ఫేం హ‌రీశ్ శంక‌ర్ తో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ అనే ఓ రీమేక్ లో వ‌ర్క్ చేశాడు.ఈ సినిమా కూడా యాక్టింగ్ ప‌రంగా ఆయ‌న‌కు మంచి పేరే తెచ్చి పెట్టింది. తాజాగా అల్లు బాబి నిర్మాణ సారథ్యంలో గ‌ని అనే సినిమా చేస్తున్నాడు.బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థకు వ‌రుణ్ పూర్తి న్యాయం చేశాడ‌ని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.ఇదీ వ‌రుణ్ చిత్ర ప్ర‌యాణం..మ‌రిన్ని విజ‌యాలు మ‌రిన్ని అనుభ‌వాలు రావాలి..బాబాయ్ క‌ల్యాణ్, పెద‌నాన్నచిరు ఆశీస్సులు అందుకుని, వారి పేరు నిల‌బెట్టాలి అని కోరుకుంటూ...త‌ల్లిదండ్రుల దీవెన‌లు అందుకుని విజువ‌ల్ వండ‌ర్స్ చేయాల‌ని ఆశిస్తూ..త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఎఫ్ 3 (వేస‌వి కానుక‌గా విడుద‌ల కానున్న‌) విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటూ...హ్యాపీ బ‌ర్త్ డే వ‌రుణ్..




మరింత సమాచారం తెలుసుకోండి: