టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి జనవరి 7న విడుదల కావాల్సిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ ఆర్ ఆర్' కరోనా కారణంగా మరోసారి వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. అయితే ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవడంతో అందరూ ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. ఇక తాజాగా ఈ సినిమాను మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈసారి ప్రకటించిన 2 విడుదల తేదీలలో ఖచ్చితంగా ఏదో ఒక డేట్ కి సినిమా రావడం పక్కా అని మేకర్స్ అన్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ రెండు తేదీలలో మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే కన్నడలో ఈ సినిమాని మార్చి 18న విడుదల చేసే అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు. దానికి కారణం కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా అయిన 'జేమ్స్' ను విడుదల చేస్తున్నారు. కాబట్టి ఆ వారం మొత్తం కేవలం పునిత్ రాజ్ కుమార్ కే అంకితం ఇవ్వాలని మార్చి 17 నుంచి 23 దాకా మరే సినిమాను విడుదల చేయకూడదని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించుకున్నారు.

అంటే ఆ విధంగా థియేటర్లన్నీ పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించనున్నాయి. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు మరియు అభిమానుల మనోభావాలను దెబ్బతీయకుండా త్రిబుల్ ఆర్ సినిమా ను మార్చి 18న కాకుండా ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ చరణ్ కి జోడీగా నటించగా.. హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. అజయ్ దేవగన్, సముద్రఖని శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR