అది 1989 సంవత్సరం.. గీతాంజ‌లి అనే సినిమా విడుద‌లైన సంవ‌త్స‌రం. ఆ సినిమా ద్వారా ద‌క్షిణాదికి అత్యంత గ్రాండ్ గా ప‌రిచ‌య‌మయ్యాడు మ‌ణిర‌త్నం అనే ద‌ర్శ‌కుడు.. అంత‌క‌న్నా ముందు త‌ర్వాత కూడా అత‌డి సినిమాలుండ‌వ‌చ్చు గాక‌.. కానీ గీతాంజ‌లి ద్వారా అత్యంత పొలైట్ గా రొమాంటిక్ డ్రామాల‌ను న‌డ‌పొచ్చ‌ని నిరూపించ‌డం మాత్ర‌మే కాదు.. ఇలాంటి చిత్రాల‌కు ప్రాణం పోస్తాన‌న్న బ‌ల‌మైన న‌మ్మ‌కం గ‌ల రాఘ‌వేంద్ర‌రావ్ గారు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు గీతాంజ‌లి చూశాక‌.. గీతాంజ‌లి సినిమాతో మణిరత్నం గారి పేరు తెలుగులో మారు మ్రోగింది అని చెప్పవచ్చు. త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం అనేది ద‌క్షిణాదిలో ఒకానొక కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతూ వ‌చ్చింది.

ద‌క్షిణాది నుంచే అత్య‌ద్భుత ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. ఆ త‌ర్వాతి కాలంలో మ‌ణిర‌త్నం పేరు మాత్ర‌మే వినిపించ‌సాగింది.. దీంతో త‌మిళ సినిమాది మాత్ర‌మే అస‌లు సిస‌లు ద‌ర్శ‌క‌త్వం అన్న ప్ర‌ఖ్యాతి వ‌చ్చి చేరింది.. త‌ర్వాత శంక‌ర్ తో ఆ పేరు ప్ర‌తిష్ట‌లు మ‌రింత పెరిగి.. అది కూడా త‌మిళ సినిమా ఛాయ‌ల కింద‌కే వ‌చ్చి చేరింది.. ఆ తమిళ ఛాయలు తరిమేస్తూ ఇపుడు రాజ‌మౌళి గారితో డైరెక్షన్ మళ్ళీ.. టాలీవుడ్ ప‌రిధిలోకి వ‌చ్చింది.. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు వారి ఖ్యాతిని ఖండ ఖండాలు దాటించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ద‌ర్శ‌క‌త్వం... డైరెక్ష‌న్...ఇయ‌క్కం...ఇలా  భాష‌లు వేరైనా దాని అర్ధం శ‌బ్దం మాత్రం ఒక్క‌టే..

ఒక ద‌ర్శ‌కుడి మేథ‌స్సుకు అది చిరునామా.. అలాంటి చిరునామా ఇప్పుడు త‌న గ్రావిటీ మార్చుకుంటోంది.. దాని పేరే ప్ర‌శాంత్ నీల్.. ఇన్నాళ్ల పాటు త‌మ ఛ‌త్రం నుంచి త‌ప్పించుకుంటూ వ‌చ్చిన ద‌ర్శ‌క‌త్వం అనే ఈ మెగా ఫోన్ రిలేటెడ్ వ‌ర్డ్.. రాజ‌మౌళి ద్వారానైనా తిరిగి మ‌న ప‌థం చేరింద‌ని సంతోషించే లోపు.. క‌న్న‌డ రాజ్యం నుంచి మ‌రో భారీ స‌వాల్.. ఆ స‌వాల్ విసిరిన ప్ర‌శాంత్ నీల్ కూడా ఏపీకి చెందిన వాడేన‌నీ మ‌రీ ముఖ్యంగా అత‌డు రాయ‌ల‌సీమ నుంచి వెళ్లి క‌న్న‌డ సినీ దేశాన్ని ఏలుతున్నాడ‌ని తెలిసి కొంత సంతోషం, మ‌రికొంత నీర‌సం.. ఎందుకంటే సినిమా పుట్టింది తొలినాళ్ల‌లో రాయ‌ల‌సీమ‌లోనే. బీఎన్ రెడ్డి, కేవీరెడ్డి వంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌ర్యాయ ప‌దాలుగా నిలిచినా కూడా.. సీమ‌కు సినీ మ‌ణిహారాల్లో వ‌ర్ధిల్ల సాగారు.

ఎన్టీఆర్, ఏన్నార్ త‌ర్వాత ఆ పేరు ప్ర‌ఖ్యాత‌లు కృష్ణా- గుంటూరు- ప్ర‌కాశం, ఆ మాట‌కొస్తే కొంత గోదారి వ‌ర‌కూ వ‌చ్చి చేరాయి.. సినీ ప్రియులు అధికంగా గ‌ల నెల్లూరును కూడా ముంచెత్తాయి.. వీళ్లంతా ఒక దాస‌రి- మ‌రో విశ్వ‌నాథ్ ఇంకో రాఘ‌వేంద్ర‌రావుగా భాసిల్లి... సినీ ప్ర‌తిభ‌ను తెలుగు సినిమా పితామ‌హుడు ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడుకు చెందిన ప్రాంతానికే తిరిగి తీసుకొచ్చి పెట్టిన పేరు సాధించారు.. వీరి త‌ర్వాత తిరిగి సుకుమార్, క్రిష్ లాంటి ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కుల ద్వారా.. కృష్ణా- గోదావ‌రి తీరంలోనే సినీ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభా పాట‌వాలు అలాగే ఉన్నాయిలే అనిపించింది.. క‌ట్ చేస్తే.. కేజీఎఫ్ చాప్ట‌ర్ వ‌న్ ద్వారా 2018లో క‌న్న‌డ‌- సీమ నుంచి ఒక భారీ స్క్రీన్ బ్లాస్ట్.. 2022లో చాప్టర్ టూ త‌ర్వాత అది డిక్లైర్ అయిన శ‌బ్దం పెను శ‌ద్ధం దిశ‌గా ప‌రుగులు దీస్తోంది..

మ‌న‌కంటూ ఒక రాజ‌మౌళి ఉన్నాడుగా.. అని సంత‌సించే లోపు.. అత‌డు, అత‌డి చంద‌మామ క‌థ‌లు.. అంత‌టి హోదాను ఇవ్వ‌నివ్వ‌డం లేదు.. ఒక క‌థ తీసుకుంటే.. దాని గ్రాఫిక్స్, మేకింగ్ మీద ఎంత శ్ర‌ద్ధ పెడ‌తామో.. దాన్నో అంత‌ర్జాతీయ స‌రుకుగా అనిపించేంత‌టి క‌థ‌గా మ‌ల‌చ‌డంలో అత‌డు కొంత విఫ‌లం కాగా.. ప్ర‌శాంత్ నీల్.. మాత్రం సౌతిండియా నుంచి బిగ్గెస్ట్ డైరెక్ష‌న‌ల్ ఫేస్ క‌ట్ గా అవ‌త‌రించేశాడు.. అంతే కాదు.. ద డైరెక్ట‌ర్ అనే ప‌దానికి స‌రైన నిర్వ‌చ‌నం.. సూచించాల్సి వ‌స్తే.. త‌న త‌ర్వాతే ఎవ్వ‌ర‌వైనా అన్న సంకేతాల‌ను పంపాడు.. ఒక ప్ర‌శాంత్ నీల్ ను ఢీ కొట్టాలంటే అది మ‌రొక ప్ర‌శాంత్ నీల్ కి మాత్ర‌మే సాధ్య‌మా అన్న ఆలోచ‌న‌లకు పురుడు పోస్తున్నాడు.... ఇంతటి రీసెర్చ్ ఇంత‌టి సెటిల్డ్ వ‌ర్క్ మెన్షిప్ ఇంత‌టి క‌మిట్మెంట్ తో సినిమాను తెర‌కెక్కించే విధం.. పుట్టుకు రావాలంటే.. అది అంత తేలికైన విష‌యం కాదు.

సినిమాను సినిమాగా కాకుండా.. దాన్నొక చ‌రిత్ర‌గా మ‌లుపు తిప్ప‌గ‌ల సామ‌ర్ధ్యం అంత ఈజీ కాదు.. ఇప్పుడు బాల్ ఆ కోర్టు వైపు నుంచి ఈ వైపు కోర్టులోకి వ‌చ్చి ప‌డింది.. కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 కూడా ఉంటుంద‌న్న సంకేతాలు కూడా అందిన ఈ సంద‌ర్భంలో ప్ర‌శాంత్ రికార్డులు త‌నే ప‌డ‌గొట్ట‌గ‌ల‌డేమో అన్న ఆందోళ‌న‌లు ఇటు వైపు బ‌లంగానే వీస్తున్నాయ్.. ఇది కృష్ణా-గోదావ‌రి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు సీమ విసురుతోన్న అతి పెద్ద సినీ స‌వాల్.. ఇటు వైపు ఈ మాత్రం డైరెక్ష‌న‌ల్ ప‌వ‌ర్ ఏదైనా ఉందా? ఎవరు ఉన్నారు ? మీరే చెప్పండి ? ప్ర‌శాంత్ నీల్ ఒక 3 సినిమాలు తీసినంత మాత్రాన దక్షిణాదిలో టాప్ డైరెక్టర్ అయిపోగలడా ? మరి ప్రస్తుతం సౌత్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: