రజనీకాంత్, కమల్‌ హాసన్‌ సినిమాలకి ఒకప్పుడు తమిళనాడులో భారీ రెస్పాన్స్ ఉండేది. ఈ హీరోల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ పండగ చేసుకునేది. కానీ ఇప్పుడీ పరిస్థితులు మారిపోయాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ సినిమాలు వరుసగా బోల్తాపడ్డాయి. అంచనాలు అందుకోలేకపోతున్నాయి. దీనికితోడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానని ఊరించి..ఊరించి చివరికి ఉసూరుమనిపించాడు. ఇది అభిమానుల్లో రజనీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది.  కమల్‌ హాసన్‌ ఎక్స్‌పరిమెంట్స్ చేస్తాడు.. పెర్ఫామెన్స్‌తో ఫిదా చేస్తాడనే పేరుంది గానీ, వరుసగా హిట్స్ కొట్టలేకపోతున్నాడు. మునుపటిలా బాక్సాఫీస్‌ దగ్గర హంగామా చేయడం లేదు. కమల్‌ సరైన సక్సెస్‌ చూసి చాలా కాలమైంది. 'దశావతారం' లాంటి సినిమాలో 10 క్యారెక్టర్లు ప్లే చేసి ఆశ్చర్యపరిచినా, ఇండస్ట్రీని నడిపించే వసూళ్ల లెక్కల్లో మాత్రం మేజిక్‌ చేయలేకపోయాడు. ఇక 'ఉత్తమ విలన్, చీకటిరాజ్యం, విశ్వరూపం2' ఫ్లాపులతో కమల్‌ మార్కెట్‌ నేలని తాకింది.

రజనీకాంత్, కమల్ హాసన్‌ మార్కెట్‌లో డౌన్‌ అవుతోన్న టైమ్‌లో విజయ్, అజిత్‌ గ్రాఫ్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. ఇద్దరు టాప్ చైర్‌కి టఫ్‌ కంటెండర్స్‌గా మారారు. ఇక ఇళయదళపతి వర్సెస్ తలా అనే మాటలు మొదలయ్యాక రజనీకాంత్‌, కమల్ హాసన్‌ ప్రభావం తగ్గిపోయింది. కలెక్షన్ల రేసులోనూ ఇంపాక్ట్‌ చూపించలేకపోతున్నారు. రజనీకాంత్‌ నెక్ట్స్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో శివ కార్తికేయన్‌ ఒక హీరోగా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌తో సమానంగా ఈ పాత్ర ఉంటుందని, అందుకే శివ కార్తికేయన్‌ని తీసుకున్నారనే టాక్ వస్తోంది. ఇక శివ వరుస హిట్స్‌తో తమిళనాట ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. దీంతో ఈ హీరో ఉంటే మార్కెట్‌కి ప్లస్ అవుతుందని రజనీకాంత్‌ కూడా ఓకే చెప్పాడట.

కమల్‌ హాసన్ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో 'విక్రమ్' అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ఒక కీ రోల్‌ ప్లే చేస్తున్నాడు. అలాగే మళయాళీ స్టార్ ఫాహద్‌ ఫాజిల్‌ కూడా నటిస్తున్నాడు. సేతుపతికి కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, 'విక్రమ్‌'కి ప్లస్ అవుతాడు అనుకుంటున్నారు జనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: