హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ విడుదలై 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను అతడి ఇంటి వద్ద కలిసి వ్యక్తిగతంగా అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా హరీష్ శంకర్ బన్నీని కలవడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.


పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీయవలసిన ‘భవధీయుడు భగత్ సింగ్’ ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం కనిపించకపోవడంతో హరీష్ శంకర్ చాల కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్. మైత్రీ మూవీస్ లాంటి భారీ నిర్మాణ సంస్థ హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఇచ్చినప్పటికీ ఆసినిమాకు సంబంధించి పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలియని పరిస్థితి.


దీనికితోడు అక్టోబర్ 2 నుండి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్న నేపధ్యంలో ఆ బస్సు యాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. దీనితో హరీష్ శంకర్ పవన్ తో చేయబోయే సినిమా ప్రారంభం అయ్యేలోపు మరొక సినిమాను మరొక హీరోతో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హరీష్ శంకర్ వైపు టాప్ హీరోలు ఎవరు చూడని పరిస్థితులలో ఈ దర్శకుడు వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ కలిసి అతడికి కొన్ని స్టోరీ లైన్స్ వినిపించినట్లు టాక్.


వాస్తవానికి బన్నీ కూడ ‘పుష్ప 2’ మూవీ చేస్తూ మధ్యలో సుకుమార్ అంగీకారం తీసుకుని మరొక సినిమాని వేగంగా పూర్తి చేయాలి అన్న ప్రయత్నాలలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ లీకులు పసికట్టిన హరీష్ శంకర్ బన్నీని వ్యూహాత్మకంగా కలిసి కొన్ని స్టోరీ లైన్స్ వినిపించినప్పటికీ బన్నీ హరీష్ శంకర్ ను ఎంతవరకు నమ్ముతాడు అన్నది ప్రస్థుతానికి సమాధానం లేని ప్రశ్న. పవన్ కు వీరభక్తుడుగా పేరు గాంచిన హరీష్ శంకర్ కు పవర్ స్టార్ అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: