'మా సినిమా అద్భుతంగా వచ్చింది.. విడుదలయ్యాక థియేటర్లు దద్దరిల్లిపోతాయి'.. ఈ మాటలను వేరేలా చెప్పాలి అంటే.. మన సినిమా వాళ్లు ఎంచుకునే వాక్యం 'సినిమాకు సీక్వెల్‌ ఉంది!'.

తొలి పార్టు రిలీజ్‌ అయ్యాక రెండో పార్టు గురించి చెబుతాం అని అంటుంటారు. దీంతో తొలి సినిమా మీద ఎంతో నమ్మకం ఉండటం వల్లే రెండో పార్టు తెస్తున్నారు అని ప్రేక్షకులు అనుకుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలకు రెండో పార్టు వస్తే.. ఇంకొన్ని సినిమాలకు ఆ అవకాశమే లేకుండా పోతోంది. అలాంటి కొన్ని సినిమాల సంగతి చూద్దాం.

* వాట్‌ లగాదేంగే అంటూ మొన్నీమధ్యే వచ్చి వెళ్లాడు 'లైగర్‌'. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ ఈ సినిమా మీద నమ్మకంతో 'లైగర్‌ 2' కూడా తెస్తామన్నారు. కానీ తొలి 'లైగర్‌' ఫలితం వారిని వెనక్కి లాగేసింది అనొచ్చు.

 

* నితిన్‌ ఎంతో నమ్మకంగా చేసిన మాస్‌ చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. తనకు సూట్‌ అవ్వని అరుపుల డైలాగ్‌లతో ఆ సినిమా చేయడమే కాకుండా, దానికి సీక్వెల్‌ కూడా తెస్తాం అన్నాడు. కానీ ఆ అవకాశం లేనట్లే.

 

* 'రామారావు ఆన్‌ డ్యూటీ'తో పలకరించాడు రవితేజ. శరత్‌ మండవ తెరకెక్కించిన ఈ చిత్రానికి ముగింపులో కొనసాగింపు కథపై హింట్‌ ఇచ్చారు దర్శకుడు. అయితే సినిమా చేదు ఫలితాన్నిచ్చింది. దీంతో ఆ సినిమా ఉంటుందా అనే ప్రశ్న మొదలైంది.

 

* 'కిల్‌ కిల్‌ కిల్‌ ఖిలాడీ' అంటూ ఆ మధ్య వచ్చాడు రవితేజ. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బకొట్టింది. ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ చేస్తా అని తొలి 'ఖిలాడీ' అప్పుడు చెప్పారు దర్శకుడు. కానీ ఇప్పుడు అయ్యేలా లేదు.

 

* 'ది వారియర్‌' అంటూ ఆ మధ్య వచ్చాడు రామ్‌. ఈ సినిమా విడుదలకు ముందు దీన్ని సిరీస్‌లా కొనసాగించాలనే ఆలోచన ఉందని చెప్పారు. కానీ 'వారియర్‌' ఫలితం చూస్తే ఆ ఆలోచన సంగతి పక్కన పెట్టేశారేమో అనిపిస్తోంది.

 

* 'హ్యాపీ బర్త్‌డే' చెబుతూ ఇటీవల లావణ్య త్రిపాఠి సర్రియల్‌ కామెడీ చేసింది. కొనసాగింపు ఆలోచనతోనే రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు హ్యాపీనెస్‌ ఇవ్వలేదు. దీంతో రెండో పార్టు లేదు.

 

* గతేడాది చంద్రశేఖర్‌ యేలేటితో కలసి 'చెక్‌' చెప్పాడు నితిన్‌. కథను ముగించిన తీరులోనే సీక్వెల్‌ ఆలోచనలు కనిపిస్తాయి. కానీ సినిమా రిజల్ట్‌తో ఆ ఆలోచనలకు చెక్‌ పడింది అని చెప్పొచ్చు.

 

ఇవి కొన్ని సినిమాలు మాత్రమే. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవీ రీసెంట్‌ సీక్వెల్‌ రూమర్స్‌.. వాటి పరిస్థితులు. అర్థమైందిగా సీక్వెల్స్‌ అనే పదం ఎందుకు వాడుతున్నారో

మరింత సమాచారం తెలుసుకోండి: