కనీసం రెండు మూడు నెలల ముందైనా విడుదల తేదీలు లాక్ చేసుకోకపోతే... నిర్మాతలకు థియేటర్స్ దొరకని పరిస్థితి. ఇలా ఫలానా తేదీని వస్తున్నామని ముందుగానే ప్రకటిస్తే ఆ డేట్లో ఎవరూ రారనే గ్యారెంటీ లేదు.

కానీ వాళ్ళు ముందుగా ప్రకటించారన్న గౌరవంతోనైనా బరిలోకి మిగతావారు ఎవరూ దిగరనే ధీమా అన్నా ఉంటుంది. డిసెంబర్ మొదటి వారానికైతే ఇప్పటి వరకూ ఎవరూ కర్చీఫ్ వేసుకోలేదు. అందుకే అడవి శేష్  హీరోగా 'హిట్ 2 : ది సెకండ్ కేస్' సినిమాని ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకు సూపర్ హిట్టైన 'హిట్' చిత్రానికిది సీక్వెల్ అని తెలిసిందే. మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తే రెండో భాగానికి హీరోగా అడివి శేష్‌ను ఫిక్స్ చేశారు. నిజానికి ఇలాంటి సినిమాలకు శేష్ పెట్టింది పేరు.

గతేడాది ఇదే డేట్లో బాలయ్య , బోయపాటి కాంబో మూవీ 'అఖండ' విడుదలై దుమ్మురేపేసింది. చిత్రం దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. హ్యాట్రిక్ కాంబో కావడంతో ముందు నుంచి చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా విడుదలై హిట్ టాక్ రావడంతో... అఖండ .. అఖండ విజయం సొంతం చేసుకుంది. అందుకే ఇదే డేట్లో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో మూవీని విడుదల చేయాలనుకున్నారు. దానికి తగ్గట్టే షూటింగ్ జరుగుతోంది. కానీ, 2023 సంక్రాంతి రేసులో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మేకర్స్‌కు ఉంది. ఒకవేళ అదే సమయానికి 'ఆదిపురుష్, వారసుడు, వాల్తేరు వీరయ్య' చిత్రాలు కనుక ఆ సీజన్ ను లాక్ చేసుకుంటే బాలయ్యకు థియేటర్స్ పరంగా కొంత చిక్కు ఏర్పడుతుంది. దానికంటే ఒక నెల ముందే వచ్చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. 'అఖండ' చిత్రానికి అలా చేయడం చాలా కలిసి వచ్చింది. వారాల పాటు చిత్రానికి తిరుగే లేకుండా పోయింది. అది దృష్టిలో పెట్టుకొనే NBK 107 చిత్రాన్ని 'అఖండ' డేట్లోనే దింపుతారా అన్న విషయంలో క్లారిటీ లేదు. బహుశా ఆ ఆలోచన నిర్మాతలకు లేదు కాబట్టే ఆ డేట్ ను అడివి శేష్ లాక్ చేసుకున్నాడని అనుకోవాలి.

ఇక 'హిట్ 2' విషయానికొస్తే.. మేజర్ సూపర్ హిట్ తర్వాత అడివి శేష్ నటించిన సినిమా కావడంతో మంచి హైపు క్రియేట్ అయింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనే రెండో భాగానికీ దర్శకుడు. నేచురల్ స్టార్ నానీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. మేజర్ క్రేజ్ ను దృష్ణిలో పెట్టుకొని త్వరలో మొదలు పెట్టబోతున్న కొత్త షెడ్యూల్ లో కొన్ని కీలక మార్పులు చేస్తారని టాక్. మొదటి భాగంతో ఎలాంటి సంబంధం లేకుండా ఇందులో మరో ఫ్రెష్ కేసును అడివి శేష్ డీల్ చేస్తాడట. మరి బాలయ్యకి లక్కీ డేట్ అయిన డిసెంబర్ 2 .. శేష్ కు కూడా ఘన విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: