కొందరు టాలీవుడ్‌ అగ్రతారలు 2022ను మిస్‌ అవుతున్నారు….

అయితే ఇది కావాలని తీసుకున్న గ్యాప్‌ కాదు... కొందరికి టైమ్‌ కుదరక, మరికొందరికి వ్యక్తిగత కారణాలతో బ్రేక్‌ వచ్చింది.
ఈ ఏడాది కొంతమంది కథానాయికలు తెలుగులో స్ర్టెయిట్‌ చిత్రాలేవి అంగీకరించలేదు.

ఇక శ్రుతీహాసన్‌ పని అయిపోయిందనుకున్న దశలో ఒక్కసారిగా దూకుడు పెంచారు. అపజయాలను అధిగమించి గతేడాది 'క్రాక్‌'తో ఫామ్‌లోకి వచ్చారు. ప్రభాస్‌, చిరంజీవి లాంటి అగ్రహీరోలతో ఆమె ఆడిపాడుతున్నారు. తెలుగులో ఆమె పవన్‌కల్యాణ్‌కు జోడీగా నటించిన 'వకీల్‌సాబ్‌' కూడా సూపర్‌హిట్‌. ఇది కూడా గతేడాదే రిలీజయింది. ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క తెలుగు చిత్రం కూడా ఇప్పటిదాకా విడుదల కాలేదు. 'సలార్‌', 'వాల్తేరు వీరయ్య' సహా అన్నీ షూటింగ్‌ దశలోనే ఉన్నాయి. నిర్మాణం పూర్తయి రిలీజ్‌కు సిద్ధమవడానికి చాలా సమయం పడుతుంది. అంటే ఈ ఏడాది శ్రుతీహాసన్‌ సినిమా రిలీజ్‌కు లేనట్లే. అయితే వచ్చే ఏడాది పెద్ద చిత్రాలతో ఆ లోటును పూరించే అవకాశం ఉంది.

కథానాయికగా 'బాహుబలి' చిత్రాల క్రేజ్‌ను వాడుకోవడంలో అనుకున్నంత దూకుడు చూపలేకపోయారు అనుష్క శెట్టి. వెండితెరపైన ఆమె కథా నాయికగా చివరిసారి కనిపించింది 2018లో వచ్చిన 'భాగమతి'లోనే. 2020లో ఆమె చివరిగా 'నిశ్శబ్దం' చిత్రంలో కనిపించారు. అది ఓటీటీలో విడుదలైంది. 2019లో 'సైరా'లో ఝాన్సీ లక్ష్మీబాయిగా చిన్నపాత్రలో కనిపించారు. మంచి కథలు కుదరకపోవడం, మరోవైపు భారీగా పెరిగిన బరువును తగ్గించుకునే క్రమంలో సినిమాలకు దూరమయ్యారు అనుష్క. దానికితోడు ఆమె నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు 'భాగమతి', 'నిశ్శబ్దం' కూడా బాక్సాఫీసు దగ్గర ఘోరంగా విఫలమ్యాయి. దీంతో గ్యాప్‌ తీసుకున్నారు. నవీన్‌ పొలిశెట్టితో ఆమె ఓ సినిమా చేస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమిటో తెలియదు. అంటే ఇక ఈ ఏడాది కూడా జేజమ్మను వెండితెరపైన చూసే అవకాశం లేనట్లే.

పెళ్లయిన కొత్తలో వరుస సినిమాలతో మాంచి జోరు చూపించారు కాజల్‌ అగర్వాల్‌. కొన్ని సినిమాలు అంగీకరించారు. అయితే అవన్నీ చిత్రీకరణ దశలో ఉండగానే గర్భం దాల్చడంతో మధ్యలోనే ఆ సినిమాల నుంచి తప్పుకున్నారు. లేదంటే ఈ ఏడాది కాజల్‌ నటించిన రెండు మూడు తెలుగు సినిమాలు రిలీజయి ఉండేవి. గతేడాది 'మోసగాళ్లు' చిత్రంలో చివరిసారి ఆమె కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి సరసన 'ఆచార్య'లో నటించారు. కానీ ఆమె ఉన్న సీన్లకు కత్తెర పడడంతో తెరపైన కనిపించలేదు. ప్రస్తుతం ఆమె హిందీలో 'ఉమ' అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో 'కరుంగాపియం', 'ఘోస్టీ' షూటింగ్‌ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆమె 'ఇండియన్‌ 2' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే ఈ సినిమా షూటింగ్‌ ముగిసి, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఇక ఈ ఏడాదిలో తెలుగు తెరపై కాజల్‌ సందడి లేనట్టే.

వీరేకాకుండా ఇంకా పలువురు కథానాయికలు ఈ ఏడాది టాలీవుడ్‌ను మిస్‌ అవుతున్నారు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో జోరు చూపించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పైనే పెట్టారు. ఈ ఏడాది ఆమె అరడజనుకు పైగా బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. మరో మూడు తమిళ చిత్రాలు అంగీకరించారు. గతేడాది 'కొండపొలం' చిత్రంలో చివరిసారి తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు స్ర్టెయిట్‌ చిత్రం కూడా లేదు. గతేడాది 'అల్లుడు అదుర్స్‌', 'మేస్ట్రో'చిత్రాలతో సందడిచేశారు నభానటేష్‌. ఈ ఏడాది ఆమె ఖాతాలో ఒక్క చిత్రం కూడా లేదు. బాలీవుడ్‌ భామలు అదితీరావు హైదరీ, కియారా అద్వాణీ అడపా దడపా తెలుగు చిత్రాలు చేసేవారు. కియారా, రామ్‌చరణ్‌ సరసన చేస్తున్న చిత్రం ఇంకా షూటింగ్‌లోనే ఉంది. గతేడాది 'మహాసముద్రం'తో అలరించిన అదితి ప్రస్తుతం తెలుగు చిత్రాలని అంగీకరించలేదు...

మరింత సమాచారం తెలుసుకోండి: