విక్రమ్‌ నట విశ్వరూపం చూడటానికి ఒక్క సినిమా సరిపోదు అంటుంటారు అభిమానులు. అలాగే ప్రతి సినిమాలో ఒక కొత్త విక్రమ్‌ను చూపిస్తుంటాడు.


ఇటీవల విక్రమ్‌ అలా చేసిన ప్రయత్నం 'కోబ్రా'. విక్రమ్‌ ఈ సినిమాలో చాలా పాత్రలు వేశాడు. ఇలా ఎందుకన్నాం అంటే.. లెక్క వేయడం చాలా కష్టం అనిపించేంతగా వైవిధ్యం చూపించాడు ఆ పాత్రల్లో. ఆ వైవిధ్యమైన 'కోబ్రా' ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రంగం సిద్ధమైందట.. సోనీ లివ్‌ ద్వారా ఈ నెల 28 నుండి సినిమాను స్ట్రీమ్‌ చేయబోతున్నారట.


గత నెల థియేటర్లలో విడుదలై ఆశించిన విజయం అందించని చిత్రం 'కోబ్రా'. అయితే విక్రమ్‌ కష్టానికి మాత్రం మంచి అప్లాజ్‌ వచ్చింది. 'దశావతారం' సినిమాకు మించిన వైవిధ్యం ఈ సినిమాలో విక్రమ్‌ చూపించాడు అని ప్రేక్షకులు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ మొత్తం అవతారాలను ఓటీటీలో వీక్షించొచ్చన్నమాట. ఈ మేరకు సినిమా ఓటీటీ ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. అయితే ఎన్ని భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్‌ లెక్కల మాస్టారుగా నటించారట.


 


ఓసారి కథ గురించి చూసేస్తే బెటర్‌ కదా.. సినిమా ప్రారంభంలో ఒడిశా ముఖ్యమంత్రి దారుణంగా హత్యకి గురవుతారు. కొన్నాళ్ల వ్యవధిలోనే బ్రిటిష్ యువరాజును తన వివాహ వేడుకలో అందరూ చూస్తుండగానే హత్య చేస్తారు. దీని వెనక గణిత మేథావి మది (విక్రమ్‌) ఉంటాడు. ఫోన్, ఇంటర్నెట్ లాంటివి అస్సలు వాడని మది. మారు వేషాలతో తెలివిగా ఇదంతా చేసేస్తుంటాడట. అయితే ఈ రెండు హత్యల వెనక ఓ కార్పొరేట్ కనెక్షన్‌ని ఇన్వెస్టిగేషన్ అధికారులు కనిపెడతారు .


 


రష్యా మంత్రికి కూడా ఇదే తరహాలో ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని పసిగట్టి ఇంటర్ పోల్ అధికారి అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్‌) ఆ దేశ అధికారుల్ని హెచ్చరిస్తాడట. మరోవైపు ఓ హ్యాకర్ కూడా మదిని కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. మరి ఈ సవాళ్ల మధ్య మది తన ప్లాన్‌ని విజయవంతంగా అమలు చేశాడా లేదా? అసలు ఇంతకీ మది ఎవరు? అనేది సినిమా కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: