పొన్నియిన్‌ సెల్వన్‌ -1'ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో కార్తి  'బాహుబలి' చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. అయన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'పొన్నియిన్‌ సెల్వన్‌ -1' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ..

''ఇలాంటి పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా మీడియం ఎంత గొప్పది అన్నది అర్థమవుతోంది. కుల, మత, ప్రాంతాల బేధాలు లేకుండా సినిమా అనేది అందరినీ కలుపుతోంది. మణిరత్నంగారి 40 ఏళ్ల కల ఈ సినిమా. అందరూ ఈ చిత్రం 'బాహుబలి' సినిమాలా ఉంటుందా అని అడుగుతున్నారు. ఇప్పటికే మనం 'బాహుబలి' సినిమా చూసేశాం.. ఇంకా చూస్తూనే ఉన్నాం.. ఇష్టం పడుతున్నాం. కాబట్టి ఇంకో 'బాహుబలి' మనకు అవసరం లేదు. ఇండియాలో పుట్టిన మనకు ఎన్నో కథలున్నాయి. ఎందరో హీరోలున్నారు. వాటి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అలాంటి ఓ కథ ఇది. 70 ఏళ్లగా ఓ నవలగా ఉన్న కథని మణిరత్నం సినిమాగా తీశారు. ఇంతమంది స్టార్‌లను ఒకే తెరపై చూపించిన ఘనత ఆయనది. రామాయణ, మహాభారతాల్లో ఉన్న డీప్‌ లేయర్‌ పాత్రలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీని కిందకి తొక్కడానికి పార్టీలో ఉన్న వాళ్లు పని చేస్తున్నారు. బయటివాళ్లు పని చేస్తున్నారు. ఇదే వందేళ్ల క్రితం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి. రొమాన్స్‌, అడ్వెంచర్‌ ఇలా ప్రతి అంశం ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.

''దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. ఆయన ఇండియాలో ఉన్నందుకు మనమంతా గర్వించాలి. చాలా విషయాల్లో ఆయన స్ఫూర్తి నాకు. ఆర్ట్‌ని ఫాలోకండి.. ఈ యూనివర్శ్‌ మిమ్మిల్ని ఫాలో అవుతుంది' అని తరచూ ఆయన చెప్పే మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నా'' అని కార్తీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: