ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చిన్నపని చెప్తే చేస్తారో లేదో కాని, అదే తెర మీద తమ అభిమాన నటుడిని అనుసరించడానికి ఏమాత్రం వెనుకాడదు నేటి యువతరం. అంతలా నాటి, నేటి తరంలో ఇమిడిపోయింది సినిమా. సినిమా అనేది ఓ దర్శకుని కల్పన. వాస్తవిక ఆధారాలతో తీసినా, కాల్పనిక అంశాలను కలగలిపి కంటిగింపుగా కనికట్టు చేస్తాడు దర్శకుడు. సినిమా చూసిన మరుక్షణం నుండి ఆ సినిమాలోని అంశాలు చాలా వరకు ప్రేక్షకులను ప్రభావితం చేసి ఆలోచింపజేస్తాయి. అలాంటి ఆలోచనను ప్రతి ప్రేక్షకుడిలో రేకెత్తించే సినిమా మహర్షి.


బ్రతకడానికి, బరువెక్కడానికి తప్ప మిగతా సమయమంతా స్మార్ట్ ఫోన్ లోనే మునిగి తేలుతున్న నేటి తరాన్ని తట్టి లేపాడు మహర్షి దర్శకుడు.  నేటి సినిమా అంటే, అరకొర బట్టలతో అర్ధం పర్ధం  లేని హావభావాలతో చూసే ప్రతి ప్రేక్షకుడి బలహీనతలను సొమ్ము చేసుకోవడమే. మంచిని చూపిస్తే జనం రారని, అందుకే చెడును ప్రోత్సహిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు ఎందరో సినీ నిర్మాతలు. అందులో కొద్ది మంది మాత్రం సమాజచైతన్య స్ఫూర్తికి ప్రాధాన్యతనిస్తూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. కమర్షియల్, ఇమేజ్ పంథాని వదిలి కథా పరంగా సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు.  మంచికథ వున్నా పెట్టుబడి పేట్టే నిర్మాత, పేరున్న నటీనటులు అంత త్వరగా ముందుకు రారు.  కాని వీటన్నిటినీ అధిగమించి మహర్షి సినిమాను మన ముందుకు తీసుకురాగలిగారు వంశీ పైడిపల్లి.  


మహర్షి సినిమా ఏంటి, ఎలా వుంటుంది అన్న అంశాలు  చెప్పడానికి మన మధ్య చాలా మాధ్యమాలే వున్నాయి. వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమాకు ఎందుకు వెళ్ళకూడదు ? అనేదే ఈ విశ్లేషణ. ముందుగా చెట్లు పుట్టల వెంట చాటుమాటుగా తిరిగే వెర్రి యువతకు ఓ చిన్న సలహా... గంటలతరబడి కాలాన్ని వ్యర్ధం చేస్తూ పదిమందికి కనపడకుండా మీ ప్రేమాయణాన్ని నడుపుతున్న ఓ యువతా ఒక్కసారి మేల్కొని మీ ప్రియుడు లేదా ప్రియురాలిని ఒక్కసారి ఈ సినిమాకు తీసుకువెళ్ళగలిగితే మీరు వాళ్ళ దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదగడమే కాదు వారితో పాటు మీలో కూడా ఎంతో మార్పు వస్తుంది. అలానే రోజంతా ఆఫీసు పనులతో అవసోపాలు పడుతూ ఉసూరుమంటూ ఇంటికి వచ్చి బల్లిలా బుల్లితరను అతుక్కుపోయే ఓ మధ్యతరగతీ నీలో కొంత మార్పును తీసుకువచ్చేది ఈ సినిమా.

ఇక పబ్బులు, షికార్లు అంటూ బడా బాబుల జేబులు ఖాళీ చేసుకుంటున్న బలాదూర్ లకు ఈ సినిమా ఓ చెంపపెట్టు. వీకెండ్ కల్చర్ మొత్తాన్ని మొహం మొత్తేలా చెప్పింది ఈ సినిమా. ఓ డబ్బులున్న మారాజులూ మీ వీకెండ్ మొత్తం ఒక్కసారి ఈ సినిమాకు వెచ్చించండి, మీరే కాదు, మీతోపాటు ఊగుతూ తాగుతున్న ప్రతి ఒక్కరూ మారతారు.  మహర్షి సినిమా నేటి యువతరం పై ఎంత ప్రభావం చూపుతుందంటే ఇక నుండి వారి ‘వీకెండ్ కల్చర్’, ‘ వీకెండ్ అగ్రికల్చర్’  లా మారిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూసింతరువాత భూమిని నమ్ముకున్నవాళ్ళే ఎక్కువవుతారు తప్ప అమ్ముకునేవాళ్ళు అంతగా వుండరు. తినే ప్రతి వాడు పండించాలి అన్న సిద్దాంతం నిజంగా అభినందనీయం. అందుకే ఈ సినిమాకు సామాన్యుడిని నుండి అతిరధమహారధులందరి మన్ననలు మిన్నంటుతున్నాయి.


ఆఖరుగా ఒక్క మాట, గెలుపన్నది ధ్యేయంగా కాదు గెలుపన్నది నిరంతరం మన ప్రయాణంలో భాగమవ్వాలని అలాగే అన్నం పెట్టే ప్రతి రైతన్నకు మన వంతు సాయమందివ్వాలని ఈ సినిమాలో చూపించిన ప్రయత్నం నిజంగా మహర్షనీయం.


మరింత సమాచారం తెలుసుకోండి: