ఈ రోజు, ' డియర్‌ కామ్రేడ్‌ ' రిలీజ్‌ అవుతున్న సందర్భంగా దర్శకుడు, భరత్‌తో, ఆయన తండ్రి రమణారావుగారితో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ రచయిత, జర్నలిస్టు చైతన్యప్రసాద్‌ మనసును కదిలించేలా ఆసక్తి కరంగా వివరించారు. చదవండి!!

..............................

''రమణరావు చౌదరి గారు నా ఫేస్ బుక్ ఫ్రెండ్. మాకు ముఖ పరిచయం లేదు. కానీ ఆయన నా ప్రతి పోస్టును ఫాలో అయ్యేవారు. కొన్నిటికి అభిమానంతో కామెంట్ పెట్టేవారు. ఆ విషయం నాకు తెలుసు.

*** *** ***

భరత్ కమ్మ నా ఫేస్ బుక్ ఫ్రెండ్. మూడేళ్ళ క్రితం మిత్రుడు మహేష్ కత్తి పుట్టిన రోజు ఫంక్షన్లో అనుకోకుండా కలిసాం. తనే నన్ను పరిచయం చేసుకున్నాడు. ఇద్దరం కాస్సేపు మాట్లాడుకున్నాం. మా మాటల్లో ఇద్దరిదీ కాకినాడేనని తెలిసింది. "నేనో సినిమా ప్లాన్ చేస్తున్నాను. మీరు పాట రాయాలి" అన్నాడు భరత్. తరచూ కలవాలనుకున్నాం. కానీ మళ్ళీ కలవలేదు.

ఓ ఏడాది తర్వాత భరత్ ఫోన్ చేసి, "సినిమా మొదలవుతుందండి. ఒకసారి కలుద్దామా?" అన్నాడు. తన ఆఫీసుకు వెళ్ళాను. స్థూలంగా కథ చెప్పాడు. మీరు రాయాల్సిన పాట సందర్భం అంటూ తను వివరిస్తుంటే...ఇద్దరం కాకినాడలో వేరే వేరే సమయాలలో ఒకే విద్యార్థి సంఘంలో పని చేశామని ఇద్దరికీ అర్థమైంది.

ఆ పాట ఓ కొలిక్కి రావడానికి ఏడాది పైనే పట్టింది. (అందుకు కారణం నాకు రాయడం రాకా కాదు... తన అభిప్రాయాలు మారీ కాదు. ఎలా ఉంటే బావుంటుందని ఇద్దరం రకరకాల tunesతో, structuresతో ఒక positive దృక్పథంతో చేసిన exercise అది. Final గా Comrade Anthem తో అందరి ముందుకూ వచ్చాం) ఒక దశలో ఆ పాట ఉంటుందో లేదో అనే సందిగ్ధ పరిస్థితి కూడా నెలకొంది. ఈలోగా తన సినిమా "డియర్ కామ్రేడ్" మొదలై, కాకినాడలో చాలా భాగం షూటింగ్ జరుపుకుంది.

షూటింగ్ దాదాపు పూర్తి కావస్తున్న దశలో భరత్ కుటుంబంలో ఓ విషాద ఘటన జరిగింది. వాళ్ళ నాన్న గారు కాలం చేశారు. ఆ వార్త తెలిసి చాలా బాధ కలిగింది. భరత్ తో ఫోన్ లో మాట్లాడాను.

తర్వాత పెద్ద కర్మకు సంబంధించిన ఒక మెసేజ్ ని భరత్ నాకు whatsapp లో పంపాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. నిజంగా అది నాకు పెద్ద షాక్. చనిపోయింది భరత్ కమ్మ నాన్న గారని నాకు తెలుసు. కానీ ఆయన రమణరావు చౌదరి గారని అప్పటి వరకూ నాకు తెలియదు.

*** *** ***

ఏ కార్యానికైనా... దగ్గరి బంధువుల, స్నేహితుల ఇళ్ళ లోనివైనా... నేను కదిలి వెళ్ళడం చాలా అరుదు. అలాంటిది నేను రమణరావు చౌదరి గారి దశదిన కర్మకు వెళ్ళకుండా ఉండలేక పోయాను. కాకినాడ వెళ్ళి, నా మిత్రుడు రాజ్ కుమార్ రెడ్డితో కలిసి అచ్యుతాపురం రైల్వే గేట్ పక్కన ఉన్న చౌదరి గారి ఇంటికి వెళ్ళి, భరత్ కమ్మను కలిస్తే గాని నా మనసు ఊరడిల్లలేదు.

అలా పరుగులు పెడుతూ వెళ్ళడానికీ, 'డియర్ కామ్రేడ్' సినిమాకి నేను పనిచేయడానికీ ఏమాత్రం సంబంధం లేదు. నేను అలా వెళ్ళడానికి - నా ప్రతి పోస్టుకీ స్పందించి అభినందించే అపరిచిత రమణరావు చౌదరి గారి మరణం నన్ను కలచి వేయడం ఒక కారణమైతే, తనను నమ్మి... నూటికో కోటికో ఒకరు సక్సెస్ అయ్యే సినిమా రంగానికి పంపించిన తండ్రి తన మొదటి సినిమా పూర్తి కాకముందే ఈలోకం నుంచి నిష్క్రమిస్తే...ఆ కొడుకు ఎలా తల్లడిల్లుతాడో నాకు తెలిసివుండటం మరో కారణం.

'ఆ నలుగురు' సినిమా సమయంలో నేను ఇలాంటి సందర్భాన్నే చూసాను. ఆ చిత్ర దర్శకుడైన నా మిత్రుడు చంద్ర సిద్ధార్థ్ [చందూ] నాన్న గారు ఆ సినిమా విడుదలకు నెల రోజుల ముందు ఎప్పుడూ లేనిది తనకో ఉత్తరం రాశారు. 'నీ సినిమాలు ఏవీ నేను చూడలేదు. కానీ ఈ సినిమా ఆడుతుందని నాకెందుకో అనిపిస్తోంది. ఈ సినిమా చూడాలని ఉంది' - ఇదీ ఆ లేఖ సారాంశం. చందూ నాకది చూపించాడు. ఇద్దరం నవ్వుకున్నాం. అయితే ఆ సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఆ పెద్దాయన చనిపోయారు. అప్పటికి తాను తీసిన మూడు సినిమాల్లో తన తండ్రి చూడాలనుకున్న ఈ మూడవ సినిమా చూడకుండానే వెళ్ళిపోవడం చందూని ఇప్పటికీ ఎలా బాధిస్తోందో నాకు తెలుసు. భరత్ కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. చందూ లాగే భరత్ కూడా తన భావోద్వేగాలను బయటకు కనపడనీయడు. సన్నని చిన్న చిరునవ్వుతోనే ఎప్పుడూ కనిపిస్తాడు. కానీ ఈరోజు తన తండ్రి ఉండి ఉంటే...!!!

కాలం నిర్ణయాన్ని మనమెవరం తిరగ రాయలేము.

*** *** ***

రమణరావు చౌదరి గారూ! సాహిత్యం పైనా...కళల పైనా...పుస్తక పఠనం పైనా తనకో అభిరుచి కల్పించింది మీరేనని నాతో చెప్పిన మీ అబ్బాయి భరత్ కమ్మ తాను అనుకున్నది సాధించి, సినిమా దర్శకునిగా ఈ రోజు "డియర్ కామ్రేడ్"తో ప్రేక్షకుల సమక్షానికి వస్తున్నాడు. మొదటి సినిమానే పెద్ద బ్యానర్ పై... ఈనాటి క్రేజీ హీరోతో...నాలుగు దక్షిణాది భాషల్లో తీసాడు. సినిమా రిలీజుకి ముందే కరణ్ జొహార్ లాంటి బాలీవుడ్ దిగ్గజం ప్రశంసలు పొందడమే కాకుండా...హిందీ రీమేక్ హక్కులు కూడా అమ్ముడుపోయేంత స్థాయికి ఎదిగాడు.

'డియర్ కామ్రేడ్' రిలీజ్ ఈరోజే. జయాపజయాలు ప్రేక్షకులు నిర్ణయిస్తారు. "సినిమా తీసేసాను. ఇప్పుడు నేను దర్శకుణ్ణి కాను. ప్రేక్షకుణ్ణి" అంటున్నాడు మీ అబ్బాయి. ఆ యువకునికి ఆ విజ్ఞతనూ, స్థిత ప్రజ్ఞతనూ నేర్పిన మీరు ఇవాళ ఉండి ఉంటే...!!!

మళ్ళీ అదే మాట. కాలాన్ని మేమెవరం తిరగ రాయలేము.


మరింత సమాచారం తెలుసుకోండి: