వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ బోయ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకి బోయలు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.. ఈ నేప‌థ్యంలోనే ...బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలని, లేదంటే బీసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.


 ఓ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాకు మహర్షి అయిన వాల్మీకి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. వాల్మీకి అంటే భారతీయ సంస్కృతికి చిహ్నమని, డబ్బులు సంపాదించడం కోసం ఆయన పేరును పెట్టడం మంచిది కాదన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేదిగా సినిమా ఉండాలే తప్ప సమాజాన్ని భ్ర‌ష్టుపట్టించేదిగా ఉండరాదన్నారు. ఈ సినిమా టైటిట్‌ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. 


ధర్నాకు ఆర్‌.కృష్ణయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్‌ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘంజాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ వాల్మీకి సినిమా తీస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని, కాని గ్యాంగ్‌స్టర్‌ సినిమాకు టైటిల్‌ పెట్టడం దుర్మార్గం అన్నారు.

టైటిల్ వివాదాలు సినిమాల‌కు కొత్తేమీ కాదు.. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొమ‌రం భీం సినిమాకు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి... కానీ ఇపుడు రాష్ట్రంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల అధ్య‌క్షుని జోక్యంతో వాల్మీకి సినిమాకు టైటిల్ క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని సినీ విశ్లేష‌కుల‌ అభిప్రాయం...బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, పోరాట సమితి అధ్యక్షులు మీనగ గోపి, రేపల్లే కృష్ణారావునాయుడు మాట్లాడుతూ ఆరు నెలలుగా ఈ సినిమా పేరును మార్చాలని సినిమా మేకర్స్‌ను కోరినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే వాల్మీకి సినిమా పేరు మార్చకుంటే సినిమా యూనిట్‌పై కేసులు పెట్టి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి రాజ్‌గోపాల్‌తోపాటు సమితి సభ్యులు, బోయ కులస్థులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: